మక్కకు ‘కత్తెర’ కాటు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను చీడపీడలు ఆశి స్తున్నాయి. మొక్క దశలోనే కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. పురుగులు పంట ఆకులు, కాండాన్ని తినేస్తున్నాయి. దీంతో పంట ఎదుగుదలపై ప్రభావం కనిపిస్తోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కత్తెర పురుగు ఉధృతి మళ్లీ పెరగడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. అధిక నష్టాన్ని కలిగించే ఈ పురుగు కారణంగా దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 25,202 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా దానికి మించి 30,168 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. మొక్కదశలోనే కత్తెర పురుగు ఆశించడంతో రైతులు మందులు కొనుగోలు చేసి చల్లుతున్నారు. అయితే, తొలి దశలోనే దీనిని గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు, ఉపయోగించే మందులను మండల వ్యవసాయాధికారి మధుసూదన్ సూచించారు.
పురుగులను ఇలా గుర్తించాలి...
● మొదటి దశలో తల్లి రెక్కల పురుగు లేత మొక్కలపై పెట్టిన గుడ్లు పగిలి లద్దె పురుగులుగా మారి గుంపులుగా ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తింటూ రంధ్రాలు చేస్తాయి. ఈ రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి.
● రెండో దశలో లద్దె పురుగులు కాండం మొవ్వులో చేరి లోపల కాండాన్ని తినేస్తాయి. ఈ దశలో ఆశించిన కత్తెర పురుగు కాండాన్ని పూర్తిగా తినడంతో మొవ్వ కత్తించినట్లుగా ఉంటుంది. పురుగు తిని విసర్జించిన మల పదార్థంతో నిండి ఉంటుంది. మొవ్వ లోపల ఉన్న పూత కూడా నష్టపోయి కంకి తయారవదు.
● వాతావరణాన్ని బట్టి కత్తెర పురుగు జీవితకాలం మూడు నెలల వరకు ఉంటుంది. తల్లి రెక్కల పెరుగు జీవితకాంలో 900–1500 గుడ్లను పెడుతుంది. గుడ్ల సముదాయం దూది వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది. గుడ్లు ఆకుపచ్చ, నలుపు, బూడిద రంగులో ఉంటే వాటిని కత్తెర పురుగు గుడ్లుగా గుర్తించాలి. లద్దె పురుగులు కోశ్సార్త దశలో భూమిలో చేరుతాయి.
ఆకులను తినేస్తున్న పురుగు
నివారణ చర్యలు
ఆలస్యంగా విత్తుకున్న మొక్కజొన్నలో అంతర పంటగా నేపియర్ గడ్డి వేసుకోవాలి. విత్తనం విత్తిన వారం రోజులకు ఎకరానికి 8–10 లింగాకర్షక బుట్టలు అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి.
వేపనూనె 5మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే తొలిదశలో తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
విత్తనం విత్తిన 40–45 రోజుల దశలో స్పైనోసాడ్ ఎస్సీ 60ఎంఎల్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎమమెక్టిన్ జెంబోయేట్ పిచికారీ చేయాలి.
పెరుగుతున్న పురుగు ఉధృతి
మొక్కదశలోనే దాడి చేయడంతో
రైతుల్లో ఆందోళన
జిల్లాలో 30,168 ఎకరాల్లో
మొక్కజొన్న సాగు
మక్కకు ‘కత్తెర’ కాటు


