పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
● స్వేచ్ఛగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలి
● నిజామాబాద్ డివిజన్
పోలీసు అధికారులతో సీపీ సాయిచైతన్య
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): రెండో విడత పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయిచైతన్య నిజామాబాద్ డివిజన్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో శుక్రవారం డిచ్‌పల్లి సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. ప్రధానంగా సమస్యాత్మక, అతిసమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదరగొట్టాలని సూచించారు. డబ్బు, మద్యం ఇతరత్రా అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్ట్‌లను పకడ్బందీగా నిర్వహించాల న్నారు. విలేజ్ పోలీసు అధికారులు గ్రామాలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో అశ్రద్ధ వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్, సురేశ్, వినోద్, సీఐ భిక్షపతి, నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, ఎస్సైలు ఎండీ ఆరిఫ్, మహేశ్, సందీప్, రాజశేఖర్, రామకృష్ణ, కళ్యాణి, సుస్మిత తదితరులు పాల్గొన్నారు.


