పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● మూడో విడత పీవోలకు శిక్షణ
బాల్కొండ: పోలింగ్ విధులపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోల సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన 18 రకాల ఐడీ కార్డులలో ఏదైనా ఒక దానిని ఓటరు తీసుకురావొచ్చన్నారు. సమావేశంలో ఆర్‌వోలు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.


