కాంగ్రెస్ పాలన అవినీతిమయం
సిరికొండ: రాష్ట్రంలో కాంగ్రెస్‌పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుద్దెటి లక్ష్మికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా లంచాలు ఇవ్వనిదే పనులు కాని దుస్థితి నెలకొందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను మేము మంజూరు చేశామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెప్పుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే గ్రామానికో ఏజెంట్‌ను పెట్టుకొని అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే జేఏసీ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించాలని కోరారు. సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, పిట్ల రామకృష్ణ, రామస్వామి, దేవరాం, గుద్దెటి నర్సయ్య, పెద్ద కొండయ్య, రామాగౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


