బలగమే బలం
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామంచాయతీ ఎన్నికల సందర్భంగా బంధాలు బలపడుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు బంధువులు తోడుగా నిలుస్తున్నారు. స్థానికంగా ఊళ్లలో ఉన్నవారే కాకుండా ఆయా గ్రామాల్లో ఉన్న తోబుట్టువులు, మామలు, అల్లుళ్లు, కోడళ్లు, వరుసయ్యే కొడుకులు, పెద్ద నాన్నలు, చిన్న నాన్నలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మనుమళ్లు, మనువరాళ్లు, ఆఖరికి తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా ఎన్నికల రంగంలోకి దిగారు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉన్నవారు సైతం పనులు వదులుకొని గ్రామాల్లోకి వచ్చి అభ్యర్థుల ఇళ్లలోనే ఉంటున్నారు. అందరూ ఒకచోట కూర్చొని ఏ విధంగా ప్రచారం చేయాలన్న దానిపై చర్చలు జరుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో గ్రూపులుగా వీడిపోయి వాడవాడ లా గుర్తుల ప్లకార్డులు పట్టుకొని జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి, పురుషులు పురుష ఓటర్లకు కండువాలు కప్పుతూ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ బలగం బలంగా మారడంతో కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపు ఖాయమన్నట్లుగా కనిపిస్తోంది.
కలిసి పెరిగిన దోస్తులు,
కలిసి చదువుకున్న విద్యార్థులు...
పంచాయతీ ఎన్నికల్లో స్నేహితులు కూడా అభ్యర్థుల గెలుపు కోసం పాటు పడుతున్నారు. గ్రామాల్లో కలిసి పెరిగిన దోస్తులు, కలిసి చదువుకున్న విద్యార్థులు ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. యువత ఓట్లు కీలకం కావడంతో స్నేహితులంతా ఒక్కటవుతున్నారు. వేరే ప్రాంతాల స్నేహితులు ఉద్యోగాలకు సెలవులు పెట్టి గ్రామాలకు వచ్చి ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల్లో తోడుగా నిలుస్తున్న
అభ్యర్థుల బంధువులు
సొంతవారి గెలుపు కోసం
పనులు వదులుకొని ప్రచారం


