పెరిగిన పల్లె ఓటర్ల సంఖ్య
మోర్తాడ్(బాల్కొండ): కొత్తవారి చేరికతో పల్లెల్లో ఓటర్ల సంఖ్య గతంలో కన్నా భారీగా పెరిగింది. యువతకు ఓటింగ్ అవకాశం లభించడంతో సర్పంచ్, వార్డు అభ్యర్థుల గెలుపోటములను వారు ప్రభావితం చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. అప్పట్లో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 530 ఉండగా ఓటర్లు 6,69,834 మంది ఉన్నారు. జీపీల పునర్విభజన తర్వాత జీపీల సంఖ్య 545కు చేరింది. అలాగే కొత్తవారు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్య 8,51,417 నమోదైంది. గతంలో కన్నా 1,81,583 మంది ఓటర్లు పెరిగారు. జిల్లాలో వార్డుల సంఖ్య గతంలో 4,932 ఉండగా, ఇప్పుడు 5,022గా నమోదైంది. ఓటర్ల సంఖ్య అన్ని గ్రామాల్లో పెరగడంతో వార్డుల బదలాయింపు జోరుగా సాగింది. గతంలో పెద్ద పంచాయతీల్లో ఒక్కో వార్డుకు 300 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం 400కు మించిపోయింది. చిన్న పంచాయతీల్లో ఒక్కో వార్డులో 100 నుంచి 150 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 200కు వరకు చేరింది.


