తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతిలో పెట్టే కుట్ర
● కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందితే రేవంత్ పాలనలో దోపిడీ నడుస్తోంది
● విజయ్ దివస్ కార్యక్రమంలో
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ దీక్ష ఫలితంగా సాధించిన తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భీంగల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రశాంత్‌రెడ్డి పూలమాలలు వేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ రథసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. తెలంగాణలో గుక్కెడు తాగునీరు, రైతులకు సాగు నీళ్లు లేక గోస పడుతున్న ఆనాటి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ, దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మాకివ్వాలని కోట్లాడారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పితే కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టి దీక్ష చేస్తే దిగొచ్చిన యూపీఏ సర్కార్ 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. అంతేకానీ తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. ఈనకాచి నక్కల పాలు చేసినట్లు, కేసీఆర్ కడుపులో పెట్టుకుని సాదుకున్న తెలంగాణ నేడు దోపిడీ దొంగల పాలైందన్నారు. కేసీఆర్ పాలనలో జీఎస్డీపీలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 12వ స్థానానికి దిగజారిపోయిందన్నారు. జీఎస్టీ వసూళ్లలో 1వ స్థానం నుంచి 28 వ స్థానానికి, తలసరి ఆదాయంలో 1వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయిందన్నారు. సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఆడబిడ్డలకు రూ.2,500, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లేదన్నారు. ఆసరా పెన్షన్ రూ.4,000 ఇవ్వడంలేదన్నారు. కేసీఆర్ బ్రహ్మాండంగా మార్చిన తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలను ప్రజలు గమనించి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.


