పట్టు వదలని విక్రమార్కుడు లింగారెడ్డి
పెర్కిట్: ఆలూర్ మండలం దేగాం సర్పంచ్‌గా ఏకగ్రీవమైన ఇట్టెడి లింగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పట్టు వదలని విక్రమార్కుడిగా కృషి చేశాడు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా, ఆర్మూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా పదవులు చేపట్టిన లింగారెడ్డికి ముగ్గురు సంతానం ఉండడంతో 1995 చట్టం ప్రకారం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలుగలేదు. దీంతో లింగారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంతానం కలిగి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిని కూడగట్టి జేఏసీని ఏర్పాటు చేశాడు. జేఏసీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 1995 చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రులకు జేఏసీ ఆధ్వర్యంలో పలుమార్లు వినతి పత్రాలను అందజేశారు. గత అక్టోబరు నెలలో ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. దేగాం సర్పంచ్ స్థానం జనరల్ కావడంతో లింగా రెడ్డి బరిలో దిగాడు. పోటీల్లో లింగా రెడ్డితో పాటు ఏడుగురు అభ్యర్థులుండగా మంగళవారం వారు తమ నామినేషన్లను ఉప సంహరించున్నారు. దీంతో లింగారెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యాడు. లింగారెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిగా సర్పంచ్ పదవిని అలంకరించడంపై గ్రామస్తులు, రాష్ట్ర జేఏసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


