రాష్ట్రంలో పాలన పడకేసింది
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కవిత
నందిపేట్ (ఆర్మూర్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వ పాలన పడకేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మండలంలోని సీహెచ్ కొండూరు గ్రామంలోగల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడిసి కొట్టుకుపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జిల్లాలో పండుతున్న పంటలపై పాలన అధికారికి అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొలి ఆశీర్వాదం జిల్లా ప్రజలు ఇవ్వాలని ఉద్దేశంతో జనం బాట ఇక్కడి నుంచి ప్రారంభించానని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం, మనోజ్ రావు, నాయుడు రామారావు తదితరులు పాల్గొన్నారు.
కవితకు ఘన స్వాగతం..
డిచ్‌పల్లి: మండలంలో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు శనివారం ఘన స్వాగతం లభించింది. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె ఇందల్వాయి టోల్‌ప్లాజా మీదుగా బయలుదేరి మధ్యాహ్నం బర్ధిపూర్ శివారులోని బైపాస్ రోడ్డు వద్దకు కవిత చేరుకున్నారు. జాగృతి మహిళా కార్యకర్తలు బతుకమ్మలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. యువకులు బైక్ ర్యాలీగా ముందు రాగా వాహనంలో ఆమె జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు.


