
దారిపైనే ధాన్యం రాశులు
ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దు
గత్యంతరం లేక రోడ్లపై..
● వాహనదారుల తిప్పలు
● కల్లాలు లేక ధాన్యం ఆరబోతకు
రైతుల ఇబ్బందులు
మాక్లూర్: పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోడానికి కల్లాలు లేక ప్రతి ఏడాది రైతులు జాతీయ, గ్రామీణ రోడ్లనే ఆశ్రయిస్తున్నారు. ప్రధాన రహదారులపై ధాన్యం రాశులు పోయడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. జిల్లాలో వరికోతలు ప్రారంభం కావడంతో మాక్లూర్ మండలంలోని రైతులు ప్రధాన రహదారులపై వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్నారు. రహదారులతో పాటు సర్వీస్ రోడ్లపైనా ధాన్యాన్ని ఆరబెడుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని గమనించని వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు ఆస్పత్రులకు చేరిన ఘటనలు ఉన్నాయి. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టవద్దని పోలీసులు రైతులకు సూచిస్తున్నా స్పందన కరువవుతోంది. ఇటీవల మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ చిన్నాపూర్ గండి ప్రాంతంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు ఆరబోసిన ధాన్యం రాశుల గుండా సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా రేడియం స్టిక్లర్లను ఏర్పాటు చేశారు. మాణిక్‌బండార్ నుంచి బోర్గాం(కె) ద్వారా నందిపేట వెళ్లే రహదారికి పొడవున రోడ్డంతా ధాన్యం ఆరబెడుతున్నారు. గడిచిన రెండేళ్లలో నవీపేట మండలం లింగాపూర్‌కు చెందిన గంగాధర్ అనే వ్యక్తి బోర్గాం వద్ద రోడ్డుపై ఆరబెట్టిన వడ్లకుప్పను ఢీకొని కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ముల్లంగి(బి) గ్రామ శివారులో ఆరబెట్టిన వడ్లపై కారు అదుపుతప్పి బోల్తా కొట్టగా కారు యజమాని తీవ్రగాయాలపాలయ్యాడు. గతేడాది చిన్నాపూర్ గండిలో ఒకరు ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మృతిచెందాడు. ఇలా ప్రతి సీజన్‌లో రోడ్లపై ఆరబెడుతున్న వడ్ల కుప్పలను ఢీకొని వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
చిన్నాపూర్ రహదారిపై ధాన్యం ఆరబెట్టిన చోట రేడియం ఏర్పాటు చేస్తున్న మాక్లూర్ పోలీసులు
బోర్గాం–శాంతినగర్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యం
మండలంలోని రైతులు తమ పంట ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టవద్దు. రాత్రుళ్లు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని గమనించక ప లువురు వాహనదారులు ప్ర మాదాలకు గురవుతున్నారు. ఇకనైనా రైతులు మైదానాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి. – రాజశేఖర్, ఎస్సై, మాక్లూర్
ధాన్యాన్ని ఆరబోసేందుకు కల్లాలు లేక గత్యంతరం లేక కోసిన పంటను రోడ్లపై ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మైదాన ప్రాంతాలు లేవు. వాహనదారులు సైతం రైతుల ఇబ్బందులను గుర్తించాలి. – గొల్ల లక్ష్మణ్, రైతు, వల్లభాపూర్

దారిపైనే ధాన్యం రాశులు

దారిపైనే ధాన్యం రాశులు

దారిపైనే ధాన్యం రాశులు