
వలస కార్మికుల ఆకలి కేకలు
మోర్తాడ్(బాల్కొండ): దేశంకాని దేశంలో సరైన తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికుల దయనీయమైన పరిస్థితి అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. జోర్డాన్‌లో వ్యవసాయ పనుల కోసం ఏడాది కింద వలస వెళ్లిన తెలంగాణ జిల్లాల కార్మికులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ ఉండలేమని తాము ఇంటికి వెళతామంటే అక్కడి యజమానులు నిరాకరిస్తున్నారు. ప్రశ్నించిన వారిని పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వలస కార్మికులు వాపోతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, నిర్మల్ జిల్లాలకు చెందిన 12 మంది వలస కార్మికులు జోర్డాన్‌లో ఉన్నారు. వ్యవసాయ పనులు చేయడానికి తమను తరలించగా జీతం ఒప్పందం ప్రకారం చెల్లిస్తున్నా సరైన భోజనం లేకపోవడంతో ఆకలి బాధ తట్టుకోలేక పోతున్నామని వలస కార్మికులు చెబుతున్నారు. మూడు పూటలా భోజనం పెడుతున్నా అది కేవలం 10 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారికి సరిపోయేంతనే ఉంటుందని కార్మికులు ‘సాక్షి’కి ఫోన్‌లో చెప్పారు. తాము చేస్తున్న పనికి సరైన ఆహారం లేకపోవడంతో తమలో ఒకరైన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కత్తి నరేశ్ అనారోగ్యం పాలైతే ఇటీవలే ఇంటికి పంపించామని వెల్లడించారు. తాము జోర్డాన్ వచ్చిన నుంచి వారంలో ఆరు రోజుల పాటు ఆలుగడ్డ కూరతోనే భోజనం పెడుతున్నారని తెలిపారు. ఒకరోజు మాత్రం చికెన్ పెడుతున్నా అది కూడా ఉడికి ఉడకుండా ఉంటుండటంతో తినలేకపోతున్నామన్నారు. ఇప్పటికే తమ కష్టాలపై సామాజిక మాధ్యమాల ద్వారా వలస కార్మికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇంటికి పంపించాలని కోరితే యజమానులు అంగీకరించడం లేదని ఎంబసీలో ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారని వలస కార్మికులు తెలిపారు. తమను ఇంటికి రప్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వలస కార్మికులు వేడుకుంటున్నారు.
విదేశాంగ శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
జోర్డాన్‌లో ఉన్న తెలంగాణ వలస కార్మికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం శనివారం అమ్మాన్‌లోని భారతదేశ రాయబార కార్యాలయానికి, విదేశాంగ శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు లేఖ పంపించారు. 12 మంది వలస కార్మికుల పేర్లు వారి పాస్‌పోర్టు నంబర్లు, మొబైల్ నంబర్లతో సహా ఇతర వివరాలను అందించారు. విదేశాంగ శాఖ స త్వరమే స్పందించి జోర్డాన్‌లో ఉన్న వలస కార్మికు లను రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
జోర్డాన్‌లో ఉపాధి కోసం వెళ్లి సరైన
తిండి లేక అనారోగ్యం పాలు
ఇంటికి వెళ్తామంటే పోలీసులతో
బెదిరిస్తున్న యజమానులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వలస కార్మికుల వినతి