
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్ట్
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మూడో టౌన్ పీఎస్ పరిధిలోని రైల్వే వంతెన వద్ద ఎస్సై కిరణ్‌పౌల్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గమనించారు. వెంటనే కారును ఆపి అందులో తనిఖీ చేయగా 40 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడిందని ఎస్సై తెలిపారు. ఇందులో మహ్మద్ అబూకర్ సిద్ధిఖీ, సయ్యద్ సమీర్, షేక్ సైఫ్, నారిపోగు జాన్ పట్టుబడగా మరో ముగ్గురు కాషిఫ్, సన్నీ, బాబీ ఇర్ఫాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ ఖర్చులు, విలాసవంతమైన ఖర్చుల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే గంజాయిని విక్రయిస్తున్నట్లు పట్టుబడ్డ నిందితులు ఒప్పుకున్నారని ఎస్సై తెలిపారు. ఇందులో ఇర్ఫాన్ తక్కువ ధరకు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి, కొంత భాగం వినియోగించి, మిగిలిన గంజాయిని నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో అధిక ధరలకు ఇతరులకు అమ్ముతుంటాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.