
డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా
విజయాల బడి
● ప్రయివేట్‌ను తలదన్నేలా
డిజిటల్ పాఠాలు
● సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లతో
మెదడుకు పదును
● 14 ఏళ్లుగా పదోతరగతిలో
వందశాతం ఫలితాలు
● ట్రిపుల్ ఐటీలో
సీట్లు సాధిస్తున్న విద్యార్థులు
● పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలలో
విభిన్న రీతిలో విద్యాబోధన
● రాష్ట్రానికి ఆదర్శంగా
నిలుస్తున్న సర్కార్ బడి
డొంకేశ్వర్(ఆర్మూర్): డిజిటల్ పాఠాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లతో మెరికల్లాంటి విద్యార్థులను సమాజానికి అందిస్తోంది డొంకేశ్వర్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 14 ఏళ్లుగా విజయ ఢంకా మోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ పాఠశాల ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులను అందించింది. ఇక్కడ చదివిన వారెంతో మంది ఆర్మీ, పోలీసు, అటవీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, టీచర్లుగా సేవలందిస్తున్నారు.
బడి కోసం..
ఎక్కడ పని చేసి వచ్చిన వారైనా సరే డొంకేశ్వర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోకి అడుగు పెడితే ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా మారి పోవాల్సిందే. రెండెకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉండే పాఠశాల ప్రయివేట్ బడులను తలదన్నేలా కొనసాగుతోంది. 1979లో పాఠశాల ఏర్పాటు కాగా చాలాకాలం పాటు ఏడో తరగ తి వరకు మాత్రమే కొనసాగింది. 1994–95లో పదో తరగతికి అప్‌గ్రేడ్ కావడంతో విశాలమైన తరగతి గదులను నిర్మించారు. సౌకర్యాలు మెరుగయ్యేందుకు గ్రామస్తులు ఎప్పటికప్పుడు ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక్కడ చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని కృషి చేస్తున్నారు. ప్రయివేటును తలదన్నేలా వినూత్న పద్ధతుల్లో డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు.
ఉపాధ్యాయుల కృషి
క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ఉపాధ్యాయులు.. చదువులో రాణించేలా విద్యార్థులను ఆరో తరగతి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలపై విద్యార్థులు పట్టుసాధించేలా కృషి చేస్తున్నారు. అలాగే డిజిటల్ బోర్డులపై బోధన, గణితం సులభంగా అర్థమయ్యేలా ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటకు తీస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపులూ ఎప్పటికప్పుడు వారి సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలంటే భయం లేకుండా ప్రేరణ కలిగిస్తున్నారు. విద్యార్థులకు కనీసం రెండు ఇతర రాష్ట్రాల భాషలు వచ్చి ఉండాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి విద్యార్థులకు హర్యానా భాష, సంస్కృతులను నేర్పుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్నా భోజనం రుచిగా ఉండేలా పర్యవేక్షణ చేయడమే కాకుండా టీచర్లు, గ్రామస్తులు సొంత ఖర్చులతో శుద్ధి చేసిన మినరల్ వాటర్‌ను అందిస్తున్నారు.
పాఠశాలలో ప్రార్థన చేస్తున్న విద్యార్థులు
ఇక్కడే చదివి టీచర్ కొలువు సాధించా
నా స్వగ్రామం ఇదే. 1985 వరకు ఇక్కడే చదువుకున్నా. ఇప్పుడు ఇ క్కడే ఉపాధ్యాయుడిగా పని చేస్తు న్నా. డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు బాగుంటాయి. ఎలాంటి విద్యార్థులనైనా చదువులో రాణించేలా ఇక్కడి ఉపాధ్యాయులు తీర్చి దిద్దుతారు. మేము చదువుకున్న కాలంలో కన్నా ఇప్పుడు మరింత సౌకర్యాలున్నాయి. కొన్నేళ్లుగా పదో తరగతిలో సాధిస్తున్న ఫలితాలను చూస్తూంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. – సాయికుమార్, ఉపాధ్యాయుడు
అర్థమయ్యేలా చెబుతారు
నేను ఇక్కడ ఆరో తరగతిలో చేరాను. పాఠశాల వాతావరణం చాలా బాగుంటుంది. ప్రయివేటులో కన్నా బాగా చదువు చెబుతారు. అనుభవం కలిగిన టీచర్లు ఉన్నారు. పాఠాలు అర్థం కాకుంటే మళ్లీ అర్థమయ్యే రీతిలో చెబుతారు. డిజిటల్ క్లాసులతోపాటు సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా చదువు మరింత చక్కగా నేర్చుకుంటున్నాం.
– సుంకరి సహస్ర, టెన్త్ విద్యార్థిని, డొంకేశ్వర్
కూతురిని ఇదే పాఠశాలలో చేర్పించి..
ఫొటోలో కనిపిస్తోంది ఉపాధ్యాయుడు సాయికుమార్. పక్కన ఉన్నది ఆయన కూతురు సాయిస్నిగ్ధ. సాయికుమార్ ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ప్రయివేటు పాఠశాలలో బోధన బాగోలేదని కారణంతో కూతురిని ఆ పాఠశాల నుంచి తీసేసి తాను పాఠాలు చెబుతున్న డొంకేశ్వర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించాడు. దీంతో ఉపాధ్యాయుడిని పలువురు అభినందిస్తున్నారు. సాయిస్నిగ్ధ ప్రస్తుతం పదో తరగతి చదువుతుండగా.. ప్రయివేటు కన్నా ఇక్కడే బాగుందని చెబుతోంది.
ఈ ఏడాది ట్రిపుల్ ఐటీకి 27 మంది..
డొంకేశ్వర్ పాఠశాల నుంచి ఈ ఏడాది ప్రతిష్మాతక ట్రిపుల్ ఐటీకి 27 మంది విద్యార్థులు ఎంపిక కావడం రాష్ట్రంలోనే రికార్డు. మొత్తం 74 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయగా 66 మంది 500కుపైగా మార్కులు సాధించారు. మిగతా 8 మంది విద్యార్థులు 480 నుంచి 499 మధ్య మార్కులు సాధించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. తోట రక్షిత (586), డి. వైశాలి (582) మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.

డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా

డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా

డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా

డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా

డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా

డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా

డొంకేశ్వర్ స్కూల్ విజయఢంకా