లింగంపేట/సిరికొండ: తీవ్ర వర్షాభావం వల్ల వరి నార్లు ఎండిపోతుండడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన వర్షాలు పడకపోవడంతో బోరు బావులు వట్టిపోతున్నాయి. జూన్‌లో అడపాదడపా వర్షాలు కురిసినా జూలైలో వర్షాలు కురవక పంటల సాగు ఇబ్బందికరంగా మారింది. రైతులు తుకాలు పోసిన నుంచి వర్షాలు పడక ఎండిపోతున్నాయి. దీంతో తుకాలు కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన బ్యాగరి సాయిలు, ఆర్ల బాల సాయిలు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను కిరాయికి తీసుకొని నారుమడికి నీరు పెడుతున్నారు. వీరు గ్రామ శివారులోని పంట చేను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. అలాగే సిరికొండ మండలం తాళ్లరామడుగు వడ్డెర కాలనీకి చెందిన రైతు రాజకిషన్ తన బోరు పోయక వరి నారుమడి ఎండిపోతుండటంతో ట్యాంకర్ ద్వారా నీళ్లు పోసి బతికించుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలు సాగు చేయడానికి వరినారు కాపాడుకుంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురవకపోతే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ప్రతీరోజు ఆకాశం వైపు చూస్తూ వరుణ దేవుడిని వేడుకుంటున్నామని వాపోయారు.
నారుమడి తడి కోసం తంటాలు