
పోరుబాటలో ఎన్నో విజయాలు..
ఆర్మూర్ : వ్యవసాయ క్షేత్రంలో ఆరుగాలం శ్రమించి పంట పండించడమే కాదు, తమ డిమాండ్‌ల సాధనకు అవసరమైతే ఉద్యమించి ప్రభుత్వాల మెడలు వంచి ఒప్పించగల నేర్పరులు ఆర్మూర్ ప్రాంత రైతులు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీల ఆధ్వర్యంలో పోరాడి డిమాండ్లు సాధించుకుంటున్నారు. రైతుల ఉద్యమాల ఫలితంగానే 2003లో అర్గుల రాజారాం(గుత్ప) ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులుపడ్డాయి. 2008లో ఎర్రజొన్న వ్యాపారి చేతిలో మోపోయిన రైతులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 కోట్లు చెల్లించింది. 2009లో అప్పటి సీఎం రోశయ్య కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విజయాలన్నింటి వెనక రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంతో పోరాటాలు చేసిన రైతులే ఉన్నారు.
పసుపు పరిశోధనకు..
2007లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ సూచన మేరకు ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం సహకారంతో 2009లో కమ్మర్‌పల్లిలోని 36 ఎకరాల్లో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని అప్పటి సీఎం రోశయ్య ప్రారంభించగా శాస్త్రవేత్తలు ఇక్కడ కొత్త వంగడాలను సృష్టిస్తూ పసుపు పంట పండించడంలో రైతులకు మెళకువలు నేర్పుతున్నారు.
బోర్డు కోసం ఢిల్లీ వరకు..
పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు 2018–19లో ఉద్యమ బాటపట్టారు. ఫలితంగా బీజేపీ ప్రభుత్వం పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వాలను ఒప్పించి డిమాండ్లు సాధించే నేర్పరులు ఆర్మూర్ రైతులు
ఐకమత్యంలో ఆదర్శం
ఎర్రజొన్న, రుణమాఫీ, లిఫ్ట్ సాధన
సాధించి చూపారు..
నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్, బాల్కొండకు సాగు నీరందకపోవడంతో గుత్ప ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల ద్వారా ఆర్మూర్‌కు తీసుకురావడం సాధ్యం కాదని అప్పటి ప్రభుత్వాలు పేర్కొడంతో 2003లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమించి ఎత్తిపోతల పథకాన్ని సాధించుకున్నారు. రైతులు చేసిన ఉద్యమానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కదలి వచ్చి రూ. 204 కోట్లతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. 2008 మార్చి 18న గుత్ప ఎత్తిపోతల పథకం పూర్తికావడంతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని 38,792 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.