విత్తన పసుపునకు డిమాండ్
బాల్కొండ: పసుపు పంటకు గత సీజన్‌లో మంచి ధర లభించడంతో చాలా మంది రైతులు పసుపు పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో విత్తన పసుపునకు డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం వరకు పసుపు పంటకు ధర లేకపోవడంతో రైతులు గతేడాది సాగు విస్తీర్ణం తగ్గించారు. కానీ, ఊహించని విధంగా పసుపు పంటకు క్వింటాలుకు రూ. 20 వేల వరకు ధర పలకడంతో రైతులు మళ్లీ పసుపు పంట సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం పసుపు సాగు చేసేందుకు విత్తనం అవసరం. కానీ, మార్కెట్‌లో విత్తనం అందుబాటులో ఉండదు. కేవలం రైతుల వద్దనే లభిస్తుంది. దీంతో ప్రస్తుతం బస్తాల చొప్పున పసుపు విత్తనం కొనుగోలు చేస్తున్నారు. ముక్కలు చేసిన పసుపు బస్తాను రూ. 2 వేలకు కొనుగోలు చేస్తున్నారు.
పొరుగు జిల్లాల నుంచి వచ్చి..
పసుపు పంట నిజామాబాద్ జిల్లాలోనే అధికంగా సాగు చేస్తారు. కానీ, ప్రస్తుతం పొరుగు జిల్లాలు అయిన నిర్మల్, ఆదిలాబాద్ రైతులు అధికంగా పసుపు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిజామాబాద్‌కు వచ్చి విత్తన పసుపును కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కూడా విత్తన పసుపుతో వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ బస్తా రూ 2 వేలకు కొనుగోలు చేసి వారి ప్రాంతంలో రూ. 2500 లకు విక్రయిస్తున్నారు.
బస్తాకు రూ.2 వేలు
కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు


