
చేతులెత్తేసిన ఐకేపీ
బాల్కొండ: యాసంగి సీజన్ ధాన్యాన్ని సేకరించేందుకు మండలంలోని జలాల్‌పూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఒక్క బస్తా ధాన్యాన్ని కూడా కాంటా చేయకుండానే కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారు. హమాలీలు లేరంటూ ధాన్యం సేకరించకుండానే చేతులెత్తేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోయారు. జలాల్‌పూర్ రైతులు సుమారు 760 ఎకరాల్లో వరి సాగు చేశారు. సగం విస్తీర్ణంలో వ్యాపారులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకొని సీడ్ వరి సాగు చేయగా ఆ దిగుబడిని వ్యాపారులు తీసుకున్నారు. మిగతా సగం విస్తీర్ణంలో సాగైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు రూ.1900కు క్వింటాల్ చొప్పున విక్రయించారు. ఈ లెక్కన బోనస్ కలుపుకుంటూ రైతులు క్వింటాల్‌కు రూ.900 నష్టపోయారు. ఖరీఫ్ సీజన్‌లోనైనా పీఏసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్క బస్తా కాంటా చేయలేదు
జలాల్‌పూర్‌లో కొనుగోలు
కేంద్రం ఎత్తివేత
ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం
విక్రయించి నష్టపోయిన రైతులు