
ప్రజావాణికి 104 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఇరిగేషన్ స్థలాన్ని కాపాడాలి..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో కబ్జాకు గురవుతున్న ఇరిగేషన్ స్థలాన్ని కాపాడాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్గుల్ సురేశ్ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విలువైన నిజాంసాగర్ కాలువ స్థలాన్ని కొందరు తప్పుడు సర్వే నంబర్లతో కబ్జా చేశారని పేర్కొన్నారు. స్థలాన్ని ప్లాట్లుగా చేసి ఇతరులకు విక్రయిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.