
సేంద్రియ ఎరువులను వినియోగించాలి
రెంజల్(బోధన్): నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రైతులు సేంద్రియ ఎరువులను వినియోగించాలని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు స్వప్న, రాజ్‌కుమార్ సూచించారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు తక్కువ యూరియా వినియోగించుకొని, సాగు ఖర్చులను తగ్గించుకోవాలన్నారు. ప్రైవేట్ రకాలకు దీటుగా వానాకాలానికి అనువైన వరి వంగడాలు కూనారం 1638, వరంగల్ సిద్ది, డబ్ల్యూజీఎల్ 1119, ఆర్‌డీఆర్ 1200, ఆర్‌డీఆర్ 1162, ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంటి రకాలు రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రావ్, పశువైద్యాధికారి విఠల్ తదితరులు పాల్గొన్నారు.