
పచ్చిరొట్ట.. పంట దిట్ట
బాల్కొండ: అధికంగా దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విపరీతమైన రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతిని పంటలు తీవ్రమైన పోషకాల లోపాలతోపాటు చీడపీడల ఉధృతికి గురవుతాయి. వీటన్నింటికీ పచ్చిరొట్ట ఎరువుల వాడకమే విరుగుడని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తోంది. పచ్చిరొట్ట సాగు, వాటి ఉపయోగాలపై బాల్కొండ వ్యవసాయ అధికారి బద్దం లావణ్య వివరించారు.
జనుము
జనుము ఎకరానికి 10– 15 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. జనుమును పూత దశలో దుక్కిలో కలియదున్నాలి. ఒక టన్ను జనుము పచ్చిరొట్టలో 4 కిలోల నత్రజని ఉంటుంది. వరి పొలాలకు, ముంపు నేలలకు ఉపయోగపడుతుంది.
జీలుగ
జీలుగ ఎకరానికి 8–10 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. విత్తిన 70–80 రోజుల వ్యవధిలో కలియదున్నాలి. ఒక టన్ను జీలుగ పచ్చిరొట్టలో 5 కిలోల నత్రజని ఉంటుంది. చౌడు నేలలకు ఉపయోగపడుతుంది.
పిల్లిపెసర
పిల్లి పెసర ఎకరానికి 4–5 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. పూతదశలో కలియదున్నాలి. అన్ని నేలలకు ఉపయోగపడుతుంది. పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
ఉలవ
ఉలవ పచ్చిరొట్ట ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి వస్తుంది. పూతదశలో కలియదున్నాలి. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అన్ని నేలకు శ్రేయస్కరం.
అలసంద
అలసంద పచ్చిరొట్ట ఎకరానికి 4–6 టన్నుల దిగుబడి వస్తుంది. పూతదశలో కలియదున్నాలి. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. తేలిక నేలల్లో అనుకూలంగా ఉంటుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో 3.5 కిలోల నత్రజని ఉంటుంది.
ఉపయోగాలు ఇవే..
పచ్చిరొట్టల్లో సేంద్రియ పదార్థముంటుంది. సూక్ష్మజీవులు విస్తరంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమిని గుల్ల బరిచి నీటి నిలువ, ఇసుక బాగుపడి సులభంగా నీరు, గాలి వేర్లకు అందుతుంది. ఈ జాతి పైర్ల వేర్లు భూలోపలికి వెళ్లి గట్టి పొరలను చీల్చుతాయి. పచ్చిరొట్ట పైర్ల సాగుతో సూక్ష్మపోషక పదార్థాల లోపాలు రాకుండా ఉంటాయి. పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి మొక్కలకు పోషక పదార్థాలు అందుతాయి.
విత్తేకాలం
ఖరీఫ్ పంటలకు ముందు మే, జూన్‌లో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే నేలను దున్ని ఎకరానికి 12–15 కిలోల విత్తనం చల్లాలి. జనుము ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. దీర్ఘకాలిక పంటలు అయిన పండ్ల తోటల మధ్య పచ్చిరొట్టలు వేసి పెరిగిన తర్వాత దుక్కిలో దున్నవచ్చు.
భూసారం పెరుగుదలకు దోహదం
రాయితీపై అందజేస్తున్న సర్కారు