
దివ్యాంగ విద్యార్థులను గుర్తించి బడుల్లో చేర్పించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చే ర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులార్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్‌ఎన్ (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్) అనే అంశంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈసందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 భవిత కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరంలో రూ.26 లక్షలు ఎంటైటిల్మెంట్ అందజేశామన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు 21 వైకల్యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అందే అవకాశాలను వారికి చేర్చాల్సిన బాధ్యత స్పెషల్ టీచర్స్‌పై ఉంటుందన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా సాధారణ విద్యార్థులతో సమానంగా వారు విజయాలు సాధిస్తారన్నారు. జిల్లా కో–ఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్‌రావ్, డీఆర్పీలు మురళి, మమత, ప్రకాష్, రాజన్న, శ్రీనివాస్, ఐఈఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.