
కేసులను పెండింగ్ లో పెట్టొద్దు..
● ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి క్రైం: పోలీస్ స్టేషన్లకు వచ్చే కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులోనూ నాణ్యవంతమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సైబర్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. గంజాయి, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలనీ, అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో సీసీ కెమెరాల ను ఏర్పాటు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలున్నారు.