
జిల్లా క్రీడాకారులు భేష్..
నిజామాబాద్ జట్టు సభ్యులతో సీపీ సాయిచైతన్య, డాక్టర్ కవితారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు,
రాజేంద్రప్రసాద్, రత్నాకర్, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు
పోటీలను ప్రారంభిస్తున్న సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ నాగారం : క్రీడల్లో నిజామాబాద్ జిల్లా ముందువరుసలో ఉందని, చదువుతోపాటు క్రీడలు సైతం ప్రధానమేనని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. గుగులోత్ సౌమ్య ఫుట్‌బాల్ క్రీడలో జాతీయస్థాయికి ఎదగడంతో జిల్లాకు మరింత కీర్తి వచ్చిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్‌ను గురువారం సీపీ సాయిచైతన్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసింగా ఎదగాలంటే ఆటలు చాలా ముఖ్యమన్నారు. శారీరక ధృడత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యమన్న సామెతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఫుట్‌బాల్ క్రీడ సమాజంలో తోటివారితో ఎలా మెలగాలి అనేది నేర్పుతుందన్నారు. ఆటలో గెలుపు, ఓటములు సహజమని, గెలుపు కంటే పాల్గొనడమే ప్రాధాన్యమన్నారు. క్రీడా పోటీలు నిర్వహించడంతో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. టోర్నీ నిర్వహించిన డాక్టర్ కవితారెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ కవితారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, రాజేంద్రప్రసాద్, రత్నాకర్, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సౌమ్య జాతీయ జట్టుకు ఆడటం గర్వకారణం
పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నీ ప్రారంభం

జిల్లా క్రీడాకారులు భేష్..