
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
నిజామాబాద్ అర్బన్ : శిక్షణా తరగతులను చక్కగా ఆకళింపు చేసుకొని, నేర్చుకున్న అంశాలను తరగతి గదులలో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్‌ఎన్ (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్) అంశంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. బోధనా సామర్థ్యాలను మెరుగుపర్చే దిశగా ఉపాధ్యాయులకు తర్ఫీదునిస్తున్న తీరును పరిశీలించారు. ప్రత్యేకించి గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశాలపై స్టేట్ రీసోర్స్ పర్సన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సొంత బిడ్డలుగా భావిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈవో అశోక్, ఇతర అధికారులున్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల
ఆకస్మిక పరిశీలన