
‘వెంచర్’ చేస్తే.. పక్కాగా ఉండాల్సిందే
నిజామాబాద్ సిటీ: నుడా పరిధిలో వెంచర్ వేయాలంటే నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందేనంటున్నారు అధికారులు. ప్రభు త్వ అనుమతులు సరిగా లేకున్నా, వివాదాస్పద స్థ లాలున్నా నిబంధనలు అతిక్రమించినా వెంచర్ల కథ కంచికేనంటున్నారు. గతంలో వెంచర్లు ఎలా చేసినా చెల్లుబాటు అయింది. కానీ, ప్రస్తుతం మాత్రం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని, సరైన ధృవీకరణ పత్రాలుంటేను వెంచర్లకు అనుమతి మంజూరు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
విచ్చలవిడిగా వెలుస్తున్న వెంచర్లు..
నగర శివార్లతోపాటు నుడా పరిధిలో వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు. అనుమతులు లేకుండానే ప్లాటింగ్ చేసి వాటిని దళారులతో అమ్మిస్తున్నారు. కొన్నిచోట్ల అక్రమ నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన అమాయకులు లబోదిబోమంటున్నారు. అమాయకులే లక్ష్యంగా రియల్టర్లు స్థానిక నాయకులతో ములాఖత్ అవుతున్నారు. వారికి కమీషన్ ఆశచూపి వారితో ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుకున్నదే తడవుగా, స్థలం ఉంటే చాలు వెంచర్లు వేస్తున్నారు. ముందస్తు అనుమతులు లేకున్నా పనులు మొదలుపెడుతున్నారు. రాత్రింబవళ్లు పనులు చేసి అధికారుల దృష్టికి వచ్చేలోపు ప్లాట్లన్నీ అమ్మేస్తున్నారు.
నగర శివార్లలో అధికం..
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నగర శివార్లలో ఈ అక్రమ వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. నాగారం, గొల్లగుట్ట, గాంధీనగర్, సారంగపూర్, శా స్త్రీనగర్, మల్కాపూర్–ఏ, ముబారక్‌నగర్, కేశాపూ ర్, బర్దిపూర్, బోర్గాం (పి), న్యాల్‌కల్, మోపాల్, సి రిపూర్, రాంనగర్, బోర్గాం (కె), ఖానాపూర్, గౌడ్స్ కాలనీ, తారకరామనగర్ శివార్లలో వెంచర్లు వెలుస్తున్నాయి. 2 నుంచి 5 ఎకరాలున్నా చాలు వెంటనే వాటిని వెంచర్లు చేసి హాట్‌కేకుల్లా అమ్మేస్తున్నారు.
ప్రభుత్వ, ఇరిగేషన్, వక్ఫ్ భూములు..
వెంచర్లు చేస్తున్న రియల్టర్ల కన్ను ప్రభుత్వ, అసైన్డు, ఇరిగేషన్, వక్ఫ్ భూములు, స్మశానాలపై పడింది. దాంతో తమ స్థలంతో పక్కనే ఉన్న ఈ స్థలాలను సైతం కలుపుకుంటున్నారు. ఇలా నాలాలు, కుంటలు, స్మశాన వాటికలు, పబ్లిక్ పార్కుల స్థలాలనూ వదలడం లేదు.
విస్తరించిన నుడా పరిధి..
నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ గతంలో కేవలం 72 గ్రామాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 380 గ్రామాలకు విస్తరించింది. ఇందులో 3 మున్సిపాలిటీలు కూడా వచ్చాయి. ఈ పరిధిలో వెంచర్లు చేయాలంటే నుడా అధికారి డీసీపీ అనుమతి తప్పనిసరి. కానీ, స్థానిక నాయకుల సహకారంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేయడం గమనార్హం.
టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేసుకోవాలి
నుడా అనుమతి తప్పనిసరి
10 శాతం స్థలం ఖాళీగా ఉంచాలి
నిబంధనలు ఇవే..
వెంచర్‌చేసే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి.
మొత్తం వెంచర్ విస్తీర్ణంలో 10 శాతం స్థలం వదిలివేయాలి. (ఈ స్థలంలో పార్కు, ఆస్పత్రి, కిరాణాషాపు, మెడికల్ షాపు వంటి వాటి కోసం).
రోడ్లు, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి.
ఏరియా మార్కెట్ రేటు ప్రకారం ఫీజును నుడాకు లేదా మున్సిపాలిటీకి చెల్లించాలి.
15 శాతం సొమ్ము చెల్లించిన తర్వాత మొదటి డ్రాఫ్ట్ ఇస్తారు.
మొదట డమ్మీ వెంచర్ ఏర్పాటు చేయాలి.
రెండేళ్ల తర్వాత వెంచర్‌ను పక్కాగా నిబంధనల మేరకు నిర్మించాలి.
సూచించిన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ఫైనల్ లేఅవుట్‌ను అనుమతిస్తారు.
నుడా అనుమతి తీసుకోవాలి
టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి పొంది, సరైన ఫీజు చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టవద్దు. సరైన పత్రాలతో టౌన్‌ప్లానింగ్ అధికారులకు సహకరించాలి. నాన్ లేఅవుట్ వెంచర్లు చేస్తే తొలగిస్తాం. వెంచర్ పూర్తయిన తర్వాతే అమ్మకాలు చేయాలి. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– కేశ వేణు, నుడా చైర్మన్
అక్రమ వెంచర్లు కూల్చివేస్తాం
వెంచర్ చేయాలనుకునేవారు టీఎస్ బీపాస్ ద్వారా దరఖా స్తు చేసుకోవాలి. డాక్యుమెంట్లలో లోపాలుండొద్దు. సూచించిన స్థలంలోనే వెంచర్ చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ప్రజలు జాగ్రతగా ఉండాలి. నాన్ లే అవుట్ వెంచర్లలో ప్లాట్‌లు కొని మోసపోవద్దు. ఇటీవల అనుమతి లేని వెంచర్లను తొలగించాం.
– శ్రీధర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ చీఫ్ ప్లానర్

‘వెంచర్’ చేస్తే.. పక్కాగా ఉండాల్సిందే

‘వెంచర్’ చేస్తే.. పక్కాగా ఉండాల్సిందే