
సిరికొండ/ధర్పల్లి/జక్రాన్‌పల్లి/ఇందల్వాయి/నిజామాబాద్ సిటీ/మోపాల్(నిజామాబాద్‌రూరల్)/డిచ్‌పల్లి: నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణో త్సవం కనులపండువగా నిర్వహించారు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని రామాలయాల్లో ఆలయ కమిటీలు, వీడీసీల ఆధ్వర్యంలో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణం నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు సమర్పించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. అలాగే ఆలయంలో భక్తులు యజ్ఞం, హోమం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పలు ఆలయాల వద్ద ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానాలు ఏర్పాటు చేశారు.
లక్ష్మణుడు లేని సీతారామ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఇందల్వాయి రామాలయంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా రూ.25వేలు అందజేశారు. అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.50 వేలు అందజేశారు. లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో, కొండూర్, తాళ్లరామడుగు గ్రామాల్లో రామాలయాల్లో, నగరంలోని ఖిల్లా రామాలయం, సుభాష్‌నగర్ రామాలయం, బడా రాంమందిర్, ఆర్యనగర్ సీతారాముల ఆలయం, న్యాల్‌కల్ రోడ్డు కోదండ రామాలయం, కంఠేశ్వర్ హౌసింగ్‌బోర్డు కాలనీ, మాధవనగర్ రామాలయంతోపాటు పలు హనుమాన్ ఆలయాల్లోనూ రాముల వారి కల్యాణాన్ని నిర్వహించారు. నగరంలోని పాంగ్రా బ్యాంక్‌కాలనీ కమ్యూనిటి హాల్‌లో నిర్వహించిన రామనవమి వేడుకల్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ దంపతులు కల్యాణ పెద్దలుగా స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి పూజలో కూర్చున్నారు. నేడు(శుక్రవారం) శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయాల కమిటీలు భారీ ఏర్పాట్లు చేశారు. మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆలయ ధర్మకర్త నర్సింహరెడ్డి దంపతులు, దిల్‌రాజు దంపతులు, ‘బలగం దర్శకుడు జబర్దస్త్ వేణు, ఛాయాగ్రహకుడు కేవీ గుహన్, జబర్దస్త్ నటులు రాంప్రసాద్ పాల్గొన్నారు.



దుబ్బాక రామాలయంలో యజ్ఞం నిర్వహిస్తున్న భక్తులు

గుండారం గ్రామంలో డోలారోహణం

నగరంలోని పెద్ద రాంమందిరంలో..