ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని, అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు అంతరయం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల రవాణా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల సామగ్రి సరఫరా వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు ముందుగానే తనిఖీ చేసి సిద్ధం చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు, సిబ్బంది సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అన్ని సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నాకళ్యాణి, వివిధ శాఖల నోడల్ అధికారులు భోజన్న, శ్రీనివాస్, శంకర్, రమణ, విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, ఈడీఎం నదీమ్, సిబ్బంది పాల్గొన్నారు.


