ఫలితాల పంచాయితీ
ఎవరికి వారే.. తమవారంటూ..! కాంగ్రెస్–బీజేపీల మధ్య సీట్లపోటీ గుర్తులు లేకపోవడంతో గందరగోళం ఎటూ తేల్చని స్వతంత్ర సర్పంచులు కులాల ఏకీకరణతో ఫలితాల తారుమారు ఓట్ల లెక్కలపై ఊళ్లల్లో పోస్టుమార్టం
నిర్మల్: ‘గెలిచినవాళ్లలో సగానికి పైగా మావాళ్లే..’అని బీజేపీ ప్రకటిస్తుంటే.. కాదు కాదు.. ‘అత్యధిక స్థానాలు మాపార్టీ బలపర్చినవాళ్లు గెలిచినవే..’ అంటూ కాంగ్రెస్ లిస్టు చూపుతోంది. గుర్తులు లేని ఎన్నికలు కావడం, చాలామంది రెబల్స్, స్వతంత్రులూ గెలువడంతో జిల్లాలోని 400 పంచాయతీల్లో ఏపార్టీ మద్దతుదారులు ఎవరో ఇప్పటికీ తేలడం లేదు. పార్టీలు మాత్రం వాళ్లంతా మావాళ్లే.. అంటూ ప్రచారం చేసేసుకుంటున్నాయి. పార్టీల లొల్లి ఇలా ఉంటే.. ఊళ్లల్లో గెలిచిన, ఓడినవాళ్లు ఎక్కడ ఓట్లు రాలేదు.. ఎక్కడెక్కడి నుంచి వచ్చాయంటూ పోస్టుమార్టం చేస్తున్నారు. ప్రధానంగా విజయానికి దగ్గర దాకా వచ్చి ఓడిన అభ్యర్థులు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందన్న లెక్కలు వేస్తున్నారు. చాలాగ్రామాల్లో కులాల ఏకీకరణే గెలుపోటములను డిసైడ్ చేసినట్లు తేలుస్తున్నారు.
ఎందుకు ఓడిపోయామంటే..
‘అరె.. గింతగానం కష్టపడ్డం. ఊరుఊరంతా తిరిగినం. ఇంటింటికీ పోయి ఓట్లడుగుడే కాదు.. మందు, మాంసం కూడా ఇస్తిమి. అయినా.. ఓడగొట్టిండ్రు..’ అంటూ ఓడిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘అట్ల గాదన్న.. దగ్గరి దాకా అచ్చిఓడిపోవుడే బాధనిపిస్తుందే..’ అని కొందరు బాధపడుతున్నారు. ఇక అభ్యర్థుల కుటుంబసభ్యులు, అనుచరులు ఏ వార్డులో ఓట్లు రాలేదు, ఎందుకు మనవైపు రాలేవు.. అంటూ ఆరా తీస్తున్నారు.
కుల సమీకరణలతో తారుమారు..
ఐదేళ్లక్రితంతో పోలిస్తే.. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కుల సమీకరణలు బలంగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది. రిజర్వేషన్లు కలిసి రావడమే ఆలస్యం మొత్తం తమ కులస్తులను గుప్పిట్లో పెట్టుకున్నారు. కొన్ని మేజర్ గ్రామపంచాయతీల్లో కులాల ఏకీకరణ స్పష్టంగా కనిపించింది. పార్టీల ప్రభావం కంటే.. కూడా కులాలు తీవ్రంగా ప్రభావం చూపించాయి. కొన్ని ఊళ్లల్లో కులసభ్యులంతా కట్టుబాటుతో ఓటేసినట్లు తెలిసింది.
ఇప్పటికై తే.. ఇండిపెండెంటే..
జిల్లాలో మూడు విడతల్లో కలిపి 95–100 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో గతంలో కాంగ్రెస్, బీజేపీల్లో పనిచేసినవారే ఎక్కువగా ఉన్నారు. కానీ.. తమ గ్రామాల్లో రాజకీయ పరిస్థితులు, తమ పార్టీల్లో నుంచే పోటీ ఎక్కువగా ఉండటం, కులాల సమీకరణలతో స్వతంత్రులుగా పోటీచేసి గెలుపొందారు. ఫలితాల తర్వాత ఎటు వెళ్లాలనే దానిపై చాలామందిలో స్పష్టత లేదు. ఓవైపు జిల్లాలో ముధోల్, నిర్మల్ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండటం ఈ గందరగోళానికి కారణం. ఎటువెళ్తే.. ఎవరు ఎలా వ్యవహరిస్తారో అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. అందుకే.. చాలామంది ‘ఇప్పటికై తే ఇండిపెండెంట్‌గానే గుర్తించండి..’ అంటున్నారు.
పార్టీల పోటాపోటీ..
జిల్లాలో మొత్తం 400 పంచాయతీలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో తొలి విడత జరిగిన ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో కాంగ్రెస్ అధిక్యతను కనబర్చింది. బీజేపీతోపాటు ఈ మండలాల్లో బీఆర్‌ఎస్ కూడా ప్రభావం చూపింది. ఇదే విడతలోని లక్ష్మణచాంద, మామడ మండలాల్లో బీజేపీ పుంజుకుంది. రెండో విడతలో బీజేపీ అధిక్యత చాటినప్పటికీ కాంగ్రెస్ కూడా గణనీయంగా గెలుపొందింది. మూడో విడతకు వచ్చేసరికి ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ వార్ వన్‌సైడ్ అన్నట్లుగా ప్రభంజనమే సృష్టించింది. ఇక్కడ కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే స్వగ్రామంలోనూ బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. గుర్తులు లేకపోవడం, ఇటునుంచి అటు, అటునుంచి ఇటు పార్టీలు మారడం, స్వతంత్రులుగా, రెబల్‌గా పోటీచేయడంతో ఎవరు ఏ పార్టీ అనే స్పష్టంగా తేలడం లేదు.
ఫలితాల పంచాయితీ
ఫలితాల పంచాయితీ
ఫలితాల పంచాయితీ


