బీజేపీ కార్యాలయ ముట్టడికి
అరగంటపాటు పోటాపోటీగా నినాదాలు
కాంగ్రెస్ యత్నం
నిర్మల్‌చైన్‌గేట్: నేషనల్ హెరాల్డ్ కేసు సాకుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కేంద్రం వేధిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో గురువరాం ఆందోళన చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీపార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దాదాపు అరగంటకుపైగా అటు బీజేపీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని వేధించడంపై మండిపడ్డారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు.
ఉపాధి హామీ పథకం ఎత్తివేసే కుట్ర..
జిల్లా కేంద్రంలోని హోటల్‌లో బొజ్జు మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే మహాత్మాగాంధీ పేరును తొలగించిందని తెలి పారు. పేదలకు పని కల్పించాలన్న ఉద్దేశంతో 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఇది వరకు కేంద్రం వందశాతం ఫండింగ్ ఇచ్చేదని, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ చేసే లా నిర్ణయం తీసుకుని పథకాన్ని నిర్వర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందినట్లు స్థానిక ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రానున్న పరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, పీసీసీ కార్యదర్శి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను కార్యకర్తలు పాల్గొన్నారు.


