డప్పు కొట్టం.. చీపురు పట్టం
ఖానాపూర్: మండలంలోని గోడలపంపు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీసీలు ఎస్సీ కాలనీ వాసులపై వివక్ష చూపారని కాలనీ నివాసులు ఆరోపించారు. ఎస్సీ కాలనీలో గురువారం జరిగిన గ్రామసభలో పలు అభ్యర్థనలు తిరస్కరించడం, మాదిగలను ఉపేక్షించారని వెల్లడించారు. గ్రామంలో ఎస్సీ మహిళను సర్పంచ్‌గా ఎంపిక చేసి, కాలనీకి ఉపసర్పంచ్ స్థానం కూడా కేటాయించలేదని తెలిపారు. 25 ఏళ్ల తర్వాత ఎస్సీ మహిళకు సర్పంచ్ అవకాశం రావడంతో తాము దళిత కాలనీకి రావాలా అని బీసీలు అవమానించారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో శుభకార్యాలు, అశుభ కార్యాలకు డప్పు, బ్యాండ్ కొట్టమని, రోడ్డు కూడా శుభ్రం చేయమని తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో తమను ఎవరూ ఓటు అడగొద్దని హెచ్చరించారు. తమను వేరే గ్రామంలో కలపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కాలనీ నుంచి ఎన్నికైన ముగ్గురు వార్డు సభ్యులు కట్ల పోశన్న, చిలుముల రాజ్‌కుమార్, సీహెచ్.రాజకళ రాజీనామా చేస్తారని, ఇద్దరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు దూడ మల్లయ్య, కొత్తురి లక్ష్మి విధులకు వెళ్లరని వెల్లడించారు. సమావేశంలో పెద్దలు కొత్తూరి గంగరాజం, గాజుల భూమరాజం, కోరుట్ల ఊశన్న, దూడ శంకర్, జూల రాజేశ్వర్, సిలుముల లింగన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


