ఊరు ఏకమైంది.. పోరు తప్పింది!
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామీణ ప్రాంతాల్లో శాంతి, సామరస్యం ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాయి. ఎన్నికల ఖర్చులను అభివృద్ధికి మళ్లించి, ప్రజల సౌకర్యం పెంచాలనే లక్ష్యంతో ఈ విధానం అమలు చేశాయి. కానీ, ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించాల్సిన ప్రత్యేక నిధులు అందడం లేదు. గత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కానీ, సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా నజరానా అందలేదు. దీంతో ఈసారి ఏకగ్రీవానికి చాలా మంది మొగ్గు చూపలేదు. పోటీకే సై అన్నారు.
మొత్తం ఏకగ్రీవాలు ఇవీ..
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి జిల్లాలో 35 గ్రామ పంచాయతీలు, 1,237 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 2019తో పోలిస్తే ఈసారి 53 స్థానాలు తగ్గాయి. ఏకగ్రీవాల నజరానాలు రాకపోవడంతో గ్రామీణుల్లో నమ్మకం సడలింది.
మండలాల వారీగా..
కడెం మండలంలో 2019లో 29 పంచాయతీల్లో 9 ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. పెంబి మండలంలో 24 పంచాయతీలు ఉండగా 2019లో 19 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈసారి కేవలం 4 పంచాయతీలు, 124 వార్డులు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇక మామడ మంలంలో 13 పంచాయతీల నుంచి 5కి, ఖానాపూర్‌లో 10 నుంచి 5కి, సారంగాపూర్‌లో 11 నుంచి 5కి తగ్గాయి.
మూడో దశలో..
మూడో దశలో బాసర మండలం బిద్రెల్లి, ముధోల్ మండలం ఎడ్‌బిడ్ తండా, విట్టోలి తండా, తానూరు మండలం భామినితండా, హిప్నెలితండా, కోలూరు తండా, కుభీర్ మండలం జంగాంపల్లి, బ్రహ్మేశ్వర్ తండా గ్రామాలు, 333 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
మొదటి దశలో..
తొలిదశలో దస్తూరాబాద్ మండలం బుత్కూర్, లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌తండా, మామడ మండలం ఆరేపల్లి, బూరుగుపల్లి, లింగాపూర్, కప్పనపల్లి, వాస్తాపూర్, పెంబి మండలం జంగగూడ, కోస్గుట్ట, నాగపూర్, రామ్‌నగర్, ఖానాపూర్ మండలం ఆదివాసిగూడ, బాబాపూర్‌తండా, మేడంపల్లి, పాత తర్లపాడు, కొలాంగూడ 16 సర్పంచ్ స్థానా లు, 474 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
రెండో దశలో..
సారంగాపూర్ మండలం పెండల్దరి, మహావీర్ తండా, రామ్‌సింగ్ తండా, సాయినగర్‌తండా, లోకేశ్వరం మండలం బిలోలి, నర్సింహనగర్ తండా, సేవాలాల్ తండా, సోన్ మండలం లోకల్ వేల్మల్, సారంగాపూర్ స్వర్ణ (పొంకూర్), నిర్మల్ రూరల్ మండలం తల్వేద జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 10 సర్పంచ్ స్థానాలతోపాటు 430 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.


