యాసంగి.. ఢోకాలేదు!
లక్ష్మణచాంద: ఈ ఏడాది వర్షాకాలం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. అక్టోబర్ చివరి వారం, నవంబర్ తొలివారంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జలాశయాల్లోకి డిసెంబర్ తొలి వారం వరకు ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. దీంతో యాసంగి సాగును రైతులు సంతోషంగా మొదలు పెట్టారు.
జిల్లాలో పలు ప్రాజెక్టులు...
జిల్లాలోని సాగుభూములకు శ్రీరాంసాగర్, కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, సదర్మాట్ ప్రాజెక్టులు నుంచి సాగునీరు అందుతోంది. స్వర్ణ ప్రాజెక్టు కింద 9,400 ఎకరాలు, కడెం ప్రాజెక్టు కింద మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో 68,150 ఎకరాలు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 13,950 ఎకరాలు, సదర్మాట్ ప్రాజెక్టు కింద 13 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ అయిన సరస్వతి కెనాల్ ద్వారా జిల్లాలో ఏడు మండలాల పరిధిలోని 33,622 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రధానంగా నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు ఉంది. మొత్తం 28 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. సరస్వతి కాలువ జిల్లాలో 47 కిలో మీటర్లు ప్రవహిస్తుంది.
రెండో పంటకు భరోసా..
జిల్లా అన్నదాతకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు ఉంది. ఇక స్వర్ణ ప్రాజెక్టు నీటిమట్టం 1,182 అడుగులు ఉంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో ప్రస్తుతం 358 అడుగుల నీరు ఉంది. కడెం పూర్తి సామర్థ్యం 7 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీరు ఉంది. అన్ని ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు భరోసాగా రెండో పంట సాగు చేస్తున్నారు. ఆయకట్టుకు నీరు విడుదల చేసేందుకు నీటి పారుదలశాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈనెల 24న సరస్వతి కాలు వకు నీటిని విడుదల చేయనున్నారు. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల నుంచి వారం రోజుల్లో నీటి విడుదలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సదర్మాట్ నీటి విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
నిండుకుండలా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
పొట్టపెల్లి సమీపంలో వరి నారు మడి
ప్రాజెక్టుల నీటిమట్టాలు, ఆయకట్టు వివరాలు..
ప్రాజెక్టు నీటిమట్టం ఆయకట్టు
(ఎకరాల్లో)
శ్రీరాంసాగర్ 1091 అడుగులు 33,622
గడ్డెన్నవాగు 358 అడుగులు 13,950
స్వర్ణ 1,182 అడుగులు 9,400
సదర్మాట్ –– 13,000
ఈసారి నీటి కొరత లేదు..
వానాకాలం సాగు పూర్తయింది. రెండో పంట పనులు ప్రారంభించాం. సరస్వ తి కాలువ ద్వారా రెండోపంట సాగుకు సరిపడా నీళ్లు ప్రాజెక్టులో ఉన్నాయి. ఈసారి నీటి కొరత రాదు.
– సాయన్న, రైతు పొట్టపల్లి
సంతోషంగా ఉంది
ఈసారి భారీ వర్షాలు కురవడంతో వరి పంట దిగుబడి అనుకున్నంత రాలేదు. రెండో పంట సాగుకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడం సంతోషంగా ఉంది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం.
– ముత్యం, రైతు లక్ష్మణచాంద
యాసంగి.. ఢోకాలేదు!
యాసంగి.. ఢోకాలేదు!
యాసంగి.. ఢోకాలేదు!


