
ఎన్‌హెచ్ 61
ఫోర్‌లేన్‌గా
● ఫలించిన ఇద్దరు ఎమ్మెల్యేల కృషి ● విస్తరణతో తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు ● భైంసా–నిర్మల్ మార్గంలో తగ్గనున్న ప్రమాదాలు
భైంసా:తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో నిర్మల్–భైంసా మధ్య ఉన్న 61వ జాతీయ రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన మంత్రి రహదా రి విస్తరణకు అంగీకరించారు. విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.
ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బాసరలోని సరస్వతీ దేవాలయానికి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, షిర్డీలకు వెళ్లే ప్రయాణికులు ఈ 61వ జాతీయ రహదారిని విస్తృతంగా వినియోగిస్తారు. నిర్మల్ జిల్లాలో ఈ రహదారి ప్రధాన రవాణా మార్గంగా విస్తరించి ఉంది. భైంసా పట్టణంలో జిన్నింగ్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు వంటి పరిశ్రమల కారణంగా ఈ రహదారిపై భారీ లారీలతో రోజూ రద్దీ ఉంటుంది. ప్రస్తుతం రెండు వరుసల రహదారిగా ఉన్న ఈ మార్గం ఇరుకుగా ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తుతున్నాయి. ఫోర్‌లేన్‌గా విస్తరణతో ఈ సమస్యలు తీరి, ప్రయాణ సౌలభ్యం మెరుగుపడనుంది.
రోడ్డు ప్రమాదాలకు చెక్..
61వ జాతీయ రహదారిపై, ముఖ్యంగా భైంసా–నిర్మల్, భైంసా–బాసర (161బీబీ హైవే) మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గతేడాది 26 మందికి పైగా మృత్యువాత పడగా, 53 మందికి పైగా గా యాలపాలయ్యారు. ఇరుకై న రహదారి, ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పించే స్థలం లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. ఫోర్ లేన్ విస్తరణతో ఈ ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది, ఇది ప్రయాణికులకు సురక్షితమైన రవాణా అనుభవాన్ని అందిస్తుంది.
భైంసాలో బైపాస్..
ఫోర్‌లైన్ విస్తరణలో భాగంగా భైంసా పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం అవసరం. ప్రస్తుతం పార్డీ(బి) బైపాస్ నుంచి డిపో వరకు 4 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పట్టణం మధ్య నుంచి వెళుతోంది. ఈ రహదారి వెంట వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు, ప్రైవేట్ పాఠశాలలు, జిన్నింగ్ ఫ్యాక్టరీలు, జనావాసాలు ఉన్నాయి. రోడ్డు దాటే సమయంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మిస్తే, పట్టణంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు తగ్గి, స్థానికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. బైపాస్‌ను పాత చెక్‌పోస్టుతో అనుసంధానిస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయి.
భైంసా – నిర్మల్ జాతీయ రహదారి
53 కిలోమీటర్లు విస్తరణ..
నిర్మల్ నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని క ల్యాణి వరకు 61వ జాతీయ రహదారిని తెలంగాణ పరిధిలో 53 కిలోమీటర్ల మేర ఫోర్‌లేన్‌గా విస్తరించనున్నారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా భైంసా నుంచి నిర్మల్ వరకు 41 కిలోమీటర్లు, భైంసా నుంచి తానూరు మండలం బెల్‌తరోడ వరకు మరో 12 కిలోమీటర్లు నిర్మాణం జరుగనుంది. తెలంగాణలో మొత్తం 15 రహదారులను ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.33,690 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది.

ఎన్‌హెచ్ 61