
జూనియర్ కాలేజీల్లో పీటీఎం
లక్ష్మణచాంద: మాధ్యమిక విద్య విద్యార్ధి దశలో అత్యంత కీలకమైనది. ఈ దశలో వారు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలకు పూలబాటవేస్తాయి. మాధ్యమిక విద్యలో విద్యార్థులు ఎంచుకునే గ్రూపులు భవిష్యత్‌లో వారు ఏం కావాలో నిర్ణయిస్తుంది. లక్ష్యం మేరకు కోర్సులను ఎంపిక చేసుకోవాలని విద్యావంతులు సూచిస్తుంటారు. ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల్లో చాలా మంది ఉత్తీర్ణత సాధించలేక ఇబ్బందిపడుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల హాజరు శాతం పెంచి ఉత్తమ ఫలితాలు సాధించేలా పీటీఎం(పేరెంట్ టీచర్ మీటింగ్)ను జూనియర్ కళాశాలల్లో నిర్వహించాలని నిర్ణయించింది.
సందేశం పంపి....
ఇప్పటి నుంచి కళాశాలలో నిర్వహించే పోషకుల సమావేశంపై రెండు రోజుల ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ప్రతీనెల లేదా రెండు నెలలకు ఒకసారి నిర్వహించే పోషకులు–అధ్యాపకుల సమావేశాలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు అయ్యేలాగా చూడాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు శాతం, అప్పటి వరకు వారి ప్రగతి నివేదికలు సమావేశంలో చర్చిస్తారు. విద్యార్థులు ఏ దశలో ఉన్నారు, ఏయే పాఠ్యాంశాలలో వెనుకబడ్డారు. కళాశాలలో ఎలా ప్రవర్తిస్తున్నారు వంటి అంశాలకు తల్లిదండ్రులకు తెలియచేస్తారు. ఇంటికి వచ్చిన తరువాత విద్యార్ధి చదివేలాగా చూడాలని పోషకులకు సూచించనున్నారు. దీంతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేస్తారు. సమావేశాలతో ప్రతీ తల్లిదండ్రికి తమ పిల్లల అభ్యసన స్థాయి తెలుసుకుని వారిపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
పకడ్బందీగా అమలు..
రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అమలు చేస్తున్న పీటీఎం కళాశాలల ప్రిన్సిపాళ్లు పకడ్బందీగా నిర్వహిస్తే విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీనెల, లేదా రెండు నెలలకు ఒకసారి నిర్వహించి విద్యార్థుల స్థితిగతులు తల్లిదండ్రులకు వివరించి ఉత్తమ ఫలితాలు వచ్చేలాగా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయాలని పోషకులు కోరుతున్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు
ప్రభుత్వ సూచనల మేరకు ఇంటర్ కళాశాలల్లో పీటీఎం సమావేశాలు నిర్వహించాలని అ న్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేస్తాం. పీటీఎం నిర్వహించడం ద్వారా వి ద్యార్థుల స్థితిగతులు తెలుసుకుని లోపాల ను సరిదిద్ది ఉత్తమ ఫలితాలు సాధించేందు కు అవకాశం ఉంది. – పరశురామ్‌నాయక్,
ఇంటర్ నోడల్ అధికారి
మంచి నిర్ణయం
ఇంటర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచి తద్వారా మెరుగైన ఫలితాల సాధన కోసం పీటీఎం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి నిర్ణయం. దీంతో విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. హాజరు, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది.
– పురుషోత్తం,
వృక్షశాస్త్రం అధ్యాపకుడు, మామడ
హాజరు మెరుగుపడెలా.. ఉత్తీర్ణత పెంచేలా..
ప్రభుత్వం కీలక నిర్ణయం
జిల్లా సమాచారం..
మొత్తం ప్రభుత్వ జూనియర్
కళాశాలలు 13
మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య 2,240
సెకండియర్ విద్యార్థుల సంఖ్య 2,460

జూనియర్ కాలేజీల్లో పీటీఎం

జూనియర్ కాలేజీల్లో పీటీఎం