
‘తోడిశెట్టి’కి రాష్ట్రస్థాయి గుర్తింపు
● కవితా సంకలనాల్లో సోన్ ఎంఈవో కవితలు ● అభినందించిన జిల్లా సాహితీ వేత్తలు
సోన్: మండల విద్యాధికారి, కవి, రచయిత తోడిశెట్టి పరమేశ్వర్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. ఆయన రాసిన కవితలకు ఇటీవల విడుదలైన రెండు కవితా సంకలనాల్లో స్థానం దక్కింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విడుదలైన ‘సాహితీ విపంచి’ కవితా సంకలనంలో పరమేశ్వర్ రచించిన ‘సంఘర్షణ’ కవిత ప్రచురితమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విడుదల చేసిన ‘తల్లీ.. నీకు వందనం’ కవితా సంకలనంలో తోడిశెట్టి రాసిన ‘మా అమ్మ.. అపర బ్రహ్మ’ కవిత ప్రచురితమైంది.
సాహిత్య, విద్యారంగంలో కృషి
నాలుగు దశాబ్దాలుగా తోడిశెట్టి పరమేశ్వర్ ఆకాశవాణి ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల ద్వారా ‘వైజ్ఞానిక సౌరభాలు’, ‘విజ్ఞాన వీచికలు’, ‘సైన్స్ సందేహాలు.. సమాధానాలు’, ‘లోగిలి కుటుంబ గాధ రూపకాలు’ శీర్షికల కింద ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేశారు. జిల్లాలో ప్రముఖ కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన ‘అక్షర సౌరభం’, ‘మొల్లమాంబ సాహితీ వైభవం’, ‘వైజ్ఞానిక సౌరభాలు’ వంటి పుస్తకాలను రచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా తోటి సాహితీ మిత్రులతో కలిసి ‘నిర్మల భారతి’ సాహి త్య, కళా, సాంస్కృతిక, సామాజిక సంస్థను స్థాపించి, సాహితీ కార్యక్రమాలు, విద్యార్థుల కోసం వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు.
గుర్తింపు, అవార్డులు..
సాహిత్యం, విద్యారంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతోపాటు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులను పరమేశ్వర్ అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో విడుదలైన రెండు కవితా సంకలనాల్లో ఆయన కవితలు ప్రచురితం కావడంపై జిల్లా కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. పరమేశ్వర్ సాహిత్యం, విద్య, సామాజిక కార్యక్రమాల్లో చేస్తున్న కృషి యువ కవులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.