
ఎట్టకేలకు వేతనాలు
● పంచాయతీ కార్మికులకు ఊరట ● మూడు నెలలవి ఒకేసారి చెల్లింపు
లక్ష్మణచాంద: గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ, మురికి కాలువల శుభ్రత వంటి కీలక పనులతో పల్లెలను మెరుగుపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కొన్ని నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని జీతాలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ భారం మోస్తున్నారు. ఎట్టకేలకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికులకు మూడు నెలల వేతనాలను విడుదల చేసింది.
జిల్లాలో 1,520 మంది కార్మికులు
జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల పరిధిలో 1,520 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలందిస్తున్నారు. ఈ కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు బకాయిలుగా ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించాలని కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలను పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. బుధవారం నుంచి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమా చేయనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.
కార్మికుల హర్షం..
మూడు నెలల వేతనాలు ఒకేసారి విడుదల చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు చాలా తక్కువని అవి కూడా జాప్యం లేకుండా నెలనెలా చెల్లించాలని కోరారు.
ఇబ్బందులు తొలగిపోతాయి
మూడు నెలల నుంచి వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం తమ మూడు నెలల వేతనాలు విడుదల చేయడంతో మా ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
– ఉదయ్ కిరణ్, పంచాయతీ కార్మికుడు, పీచర
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందుల గుర్తించింది. ఏ ప్రిల్, మే, జూన్ మూడు నె లల వేతనాలను ఒకేసారి వి డుదల చేసింది. పంచాయ తీ కార్మికుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– ఎర్రన్న, పంచాయతీ కార్మికుడు, మల్లాపూర్

ఎట్టకేలకు వేతనాలు