
విదేశీ పర్యటనకు ఏవో
● మంత్రులు, ఐఏఎస్‌లతో కలిసి వెళ్లనున్న విశ్వనాథ్ ● బెల్లంపల్లికి చెందిన హార్టికల్చర్ అధికారి కూడా..
ఆదిలాబాద్‌టౌన్: వ్యవసాయ శాఖ ద్వారా విదేశాల్లో అధ్యయనం కోసం ఆ శాఖ మంత్రి, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాన్ని పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎం.రఘునందన్‌రావు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె.సురేంద్ర మోహన్, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏవో గా పనిచేస్తున్న విశ్వనాథ్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఉద్యానవన అధికారి జె. అర్చన ఎంపికయ్యారు. వీరు నెదర్లాండ్, ఫ్రాన్స్‌లోని ప్యారీస్ లలో పర్యటించనున్నారు. జూ న్ 10 నుంచి 15 వరకు కొనసాగే పర్యటనలో ఆ దేశాల్లో వ్యవసాయం, ఉద్యానవన పంటల సాగు స్థితిగతులు, దిగుబడులు సాధించేందుకు అనుసరి స్తున్న విధానాలు, నూతన వంగడాల సృష్టికి అవలంభిస్తున్న పద్ధతులు వంటి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మూడు రోజుల చొప్పున ఆయా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్ర బృందంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు ఉండటంతో ఇక్కడి రైతులకు సాగుపరంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.