
‘ఉపాధి’ అక్రమాలపై ‘వీఎంసీ’
వివరాలు..
జిల్లాలోని మొత్తం మండలాలు 18
మొత్తం గ్రామపంచాయతీలు 400
జిల్లాలోని మొత్తం జాబ్ కార్డులు 1.77 లక్షలు
కూలీల సంఖ్య 3.33 లక్షలు
యాక్టివ్ జాబ్ కార్డులు 1.30 లక్షలు
యాక్టివ్ కూలీల సంఖ్య 2.28 లక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిఘా వ్యవస్థను ప్రవేశపెడుతోంది. గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల (వీఎంసీ) ఏర్పాటుతో అక్రమాలు, నిధుల దుర్వినియోగం, గోస్ట్ వర్కర్లను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ ట్రాకింగ్, రియల్–టైమ్ రిపోర్టింగ్ ద్వారా పథకం బలోపేతం కానుంది.
వీఎంసీల ఏర్పాటు విధానం
ప్రతీ గ్రామ పంచాయతీలో ఐదుగురు సభ్యులతో వీఎంసీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు సగం మంది మహిళలు ఉండేలా కమిటీలను రూపొందిస్తున్నారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘ సభ్యులు, సివిల్ క్లబ్ సభ్యులు ఈ కమిటీల్లో ఉంటారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాదించి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా కలెక్టర్‌కు, తద్వారా రాష్ట్ర అధికారులకు నివేదికలు పంపుతారు. ఈ కమిటీలు ఆరు నెలలపాటు పనిచేస్తాయి. జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు, 1.77 లక్షల జాబ్ కార్డులు, 3.33 లక్షల కూలీలు ఉన్నారు, వీరిలో 1.30 లక్షల జాబ్ కార్డులు, 2.28 లక్షల కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు.
కమిటీల పర్యవేక్షణ విధులు
వీఎంసీలు వారానికి ఒకసారి పనులను పరిశీలిస్తాయి. ప్రతి నెల మూడో శుక్రవారం కూలీలు, సిబ్బందితో సమావేశమై పనుల నాణ్యత, వ్యయం, రికార్డులను తనిఖీ చేస్తాయి. సోషల్ ఆడిట్ సమయంలో నివేదికలు సమర్పించి, అధికారులు చర్యలు తీసుకునేలా చేస్తాయి. ఈ వ్యవస్థతో పథకం మరింత పారదర్శకంగా అమలవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
వీఎంసీలు ఏర్పాటు చేస్తున్నాం..
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనుల పారదర్శకత కోసం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ(వీఎంసీ)లను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన సర్క్యూలర్‌ను పంచాయతీ కార్యదర్శులకు అందజేశాం. నిబంధనల మేరకు వారు కమిటీలో సభ్యులను ఎంపిక చేసి ఒకటి రెండు రోజుల్లో నివేదిక అందజేస్తారు. కమిటీలను కలెక్టర్‌కు నివేదిస్తాం. రాష్ట్ర అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత వీఎంసీలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. – రాధ, ఎంపీడీవో,
లక్ష్మణచాంద
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
ప్రతీనెల మొదటి వారంలో తనిఖీలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

‘ఉపాధి’ అక్రమాలపై ‘వీఎంసీ’