
పాలపండ్లు విక్రయిస్తున్న మహిళ
నెన్నెల: వేసవి వచ్చిదంటే చాలు పలు రకాల అటవీ పండ్లు దర్శనమిస్తుంటాయి. అడవిలో సహజంగా దొరికే అటవీ ఉత్పత్తులను గిరిజనులు గ్రామాల్లో విక్రయించి కొత్త రుచిని చూపిస్తుంటారు. సీజన్‌లో లభ్యమయ్యే అటవీ ఫలాలను ఏటా తింటే ఆరోగ్యానికి మంచిదని పల్లె ప్రజల నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ అటవీ ఫలాలను తీసుకోవడంపై ఆసక్తి చూపుతుంటారు. పాల పండ్లు, తునికి పండ్లు, మొర్రి పండ్లు తదితర వాటిని గిరిజనులు అడవి నుంచి సేకరించి గ్రామాల్లోకి తీసుకువస్తుంటారు. దీంతో గిరిజనులకు ఈ వేసవి ఉపాధి ఇచ్చినట్లు అవుతుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే వేసవిలో కనిపించే ఈ పండ్లను కొనుగోలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. అరుదుగా కనిపిస్తున్న పాలపండ్లకు ఎక్కువ ధర ఉన్నప్పటికీ, కొనడానికి ప్రజలు వెనుకాడటం లేదు. ఈ రెండు నెలలు గిరిజనులు అడవిలో సంచరించి వీటిని సేకరిస్తుంటారు. దీంతో రెండు నెలల పాటు గిరిజనులకు ఉపాధి దొరుకుతుంది. దీంతో పాటు ఇదే సీజన్‌లో ఇప్పపూల సేకరణ సైతం చేస్తూ ఉంటారు.