క్రికెటర్‌పై పోటీ.. అభ్యర్థికి మహిళల చందాలు | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌పై పోటీ.. అభ్యర్థికి మహిళల చందాలు

Published Mon, Apr 8 2024 12:37 PM

Women donate rs 11000 for Adhir Chowdhury election campaign - Sakshi

కోల్‌కతా: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి గ్రామీణ మహిళలు చందాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన పదకొండు మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌, 1999 నుండి బెర్హంపూర్ పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధిర్ రంజన్ చౌదరికి ఎన్నికల ప్రచారం కోసం రూ.11,000 విరాళంగా అందించారు.

అభ్యర్థికి మహిళలు చందాలు ఇస్తున్న వీడియోను వార్తా సంస్థ ఏఎన్‌ఐ ‘ఎక్స్‌’లో షేర్ చేసింది. ముర్షిదాబాద్‌ జిల్లాలోని రణగ్రామ్ గ్రామానికి చెందిన మహిళలు వ్యవసాయ కూలి పనులు, మేకల పెంపకం, రోజువారీ కూలి పనుల ద్వారా సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పోగు చేసుకుని కాంగ్రెస్‌ అభ్యర్థికి విరాళంగా అందించారు. దీంతో ఆ మహిళలకు అధిర్ రంజన్ చౌదరి భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. 

బెర్హంపూర్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను పోటీకి దించింది. డాక్టర్ నిర్మల్ సాహా బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరితో అధిర్‌ రంజన్‌ చౌదరి తలపడుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. బెర్హంపూర్, మల్దహా దక్షిణ్‌తో సహా కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. 

దేశవ్యాప్తంగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనునన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. మొత్తం 543 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. 42 పార్లమెంటరీ సెగ్మెంట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో అన్ని దశల్లో పోలింగ్ జరుగుతుంది.

Advertisement
 
Advertisement