కేరళలో విజయన్‌ సర్కార్‌కు ఎదురు దెబ్బ.. గవర్నర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

VCs Appointment: Huge Set Back For Kerala CM In High Court - Sakshi

తిరువనంతపురం: కేరళలో గవర్నర్‌ వర్సెస్‌ ప్రభుత్వ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైకోర్టులో పినరయి విజయన్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీకి వీసీని నియమించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ఆదేశాలను సోమవారం పక్కపెట్టింది ఉన్నత న్యాయస్థానం. 

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) రెగ్యులేషన్స్‌ 2018 ను ఉల్లంఘించేదిగా ఆ నియామకం ఉందన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. ఈ మేరకు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కొత్త వీసీని నియమించాలని ఛాన్స్‌లర్‌ ఆఫ్‌ వర్సిటీస్‌ అయిన గవర్నర్‌ అరిఫ్ మహ్మద్ ఖాన్ను ఆదేశించింది. 

కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా  ఈమధ్యే డాక్టర్‌ రిజీని నియమించింది కేరళ ప్రభుత్వం.  అయితే ఆ నియామకం చెల్లుబాటు కాదని, యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘించేదిగా ఉందని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ మణికుమార్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఇక.. ఏపీజే అబ్దుల్‌ కలాం టెక్నాలజీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ నియామకాన్ని సైతం సుప్రీంకోర్టు తన దేశాలతో రద్దు చేసింది. యూజీసీ రూల్స్‌ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ మూడు పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదనగా పంపాల్సి ఉంటుంది. అయితే కలాం యూనివర్సిటీకి మాత్రం ఒకే ఒక్క పేరు ప్రతిపాదించింది కేరళ ప్రభుత్వం. ఆపై తొమ్మిది యూనివర్సిటీల వీసీలను తప్పుకోవాలని గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ ఆదేశించడం.. కేరళ ప్రభుత్వంతో జరుగుతున్న జగడం తెలిసిందే. 

ఈ నెల ప్రారంభంలో, గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేరళ రాష్ట్ర కేబినెట్‌ ఓటు వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top