ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ సోదరి మృతి | Uttarakhand Helicopter crash in Uttarkashi | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ సోదరి మృతి

May 8 2025 10:50 AM | Updated on May 8 2025 1:48 PM

Uttarakhand Helicopter crash in Uttarkashi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో హెలికాప్టర్‌ కూలిపోయిన (Chopper Crashes) ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల ప్రకారం.. ఉత్తర కాశీ జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో కొందరు పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్‌ భగీరథి నది (Bhagirathi River) సమీపంలో కుప్పకూలిపోయింది. కాగా, ప్రమాద సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.

అయితే, ఈ ప్రమాదంలో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి (48) మృతిచెందారు. ఈ ఘటనలో అంబికా లక్ష్మీ నారాయణ బావ భాస్కర్ (51) గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన భాస్కర్‌ను రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ రుషికేశ్‌ బయలుదేరారు. 
 

విమాన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జిల్లా పరిపాలన బృందాలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement