
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు భగ్గుమంటున్నాయి. ప్రతిదాడి కోసం భారత్ పక్కాగా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఈ తరుణంలో మే 7న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది.
ఆ సమావేశంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ 48 గంటల్లోనే రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జరగనున్న ఈ కేబినేట్ మీటింగ్‌పై అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.
ఉగ్రదాడి జరిగిన సమయం నుంచి దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. పాక్ విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచదేశాలు అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశ భద్రతపై ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో పాక్‌లో అలజడి రేగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి కేబినేట్ సమావేశం జరగనుంది.
అందులో దాయాది దేశానికి ఎలా బుద్ధి చెప్పాలి వంటి అంశాల గురించి చర్చించనున్నారు. భారత్‌పై పాక్ వైమానిక దాడులకు దిగితే ఎలా వ్యవహరించాలి..? ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఎలాంటి సూచనలు చేయాలి..? దేశంలో అత్యవసరమైన కీలకమైన కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి..? ఏదైనా ప్రమాధం జరిగితే హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలు ఏంటి..? వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
ప్రధాని మోదీ ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్‌తో పాటు హోంమంత్రి అమిత్‌షాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ (సీసీఎస్) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూజలాల ఒప్పందంపై ఆంక్షలు. దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు, గగనతలాన్ని మూసివేయడం వంటి నిర్ణయాలను భారత్ తీసుకుంది.