ఆర్థిక​ సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి

Union Budget 2021 Live Updates : Day 1 Economic Survey - Sakshi

సాక్షి , న్యూఢిల్లీ: కరోనాసంక్షోభం, వాక్సినేషన్‌, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య  ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్‌ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.  మెగా కరోనా  వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో శరవేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందనుందని ఆర్థిక సర్వే అభిప్రాయ పడింది. దీంతో లోక్‌సభ ఫిబ్రవరి 1 వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఏఈ) డాక్టర్ వి. కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఆర్థిక సర్వే : 2020-21
2020-21పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను వీ షేప్‌ రికవరీ ఉంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021 - మార్చి 2022 వరకు) జీడీపి వృద్ధి 11 శాతంగా  అంచనా వేసింది. వ్యవసాయ రంగంపై కరోనా వైరస్‌ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. కాంటాక్ట్‌ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థికవృద్ధిని బాగా ప్రభావితం చేశాయి. అయితే ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా దేశీయ ఆర్థికవ్యవస్థ పుంజుకోనుంది. 17 సంవత్సరాల్లో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్‌ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది.  నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని కోరింది. 

కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని  సర్వే  సూచించింది. అలాగే చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది.  ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో రాజులకాలంనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని భారీగా పెంచాలని సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మాంద్యం సమయంలో, మెండైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు,  ప్రైవేటు రంగం  ఆర్ధిక సంపదను మెరుగుపర్చడాకి కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన సర్వే  సిఫారసు చేసింది.

కాగా కోవిడ్-19 విస్తరణ, పలువురు సభ్యులకు కరోనా సోకిన ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాలను కుదించారు. అలాగే శీతాకాల సమావేశాలను రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి తోడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం  ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌ సెషన్‌ తొలి విడత సమావేశాలు  ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి.  రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు కొనసాగనున‍్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top