మంత్రి సన్నిహితుడి ఇంట్లో​ ఐటీ దాడులు

Tax Officials Pose Covid Warriors In Bhopal Recover 1 Crore Rupees - Sakshi

బీజేపీ కేబినెట్ ‌మంత్రి సన్నిహితుడి ఇంట్లో​ దాడులు

రూ. కోటి నగదుతో పాటు 100 స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ఆదాయపు పన్ను శాఖ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కోవిడ్‌‌ వారియర్స్‌ పేరుతో సుమారు 150 మంది ఐటీ అధికారులు ఇద్దరు వ్యాపారవేత్తలకు సంబంధించిన 20 చోట్ల దాడులు నిర్వహించారు. 100 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు రూ. కోటి విలువైన నగదను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు ఫెయిత్‌ గ్రూప్‌ అధ్యక్షుడు రాఘవేంద్ర సింగ్‌ తోమర్‌. ఆయనకు ప్రస్తుతం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కేబినెట్‌లో‌ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తితో దగ్గరి సంబంధాలు ఉండటంతో ఈ దాడులు కలకలం రేపుతోంది.

వివరాలు.. రాఘవేంద్ర సింగ్‌ తోమర్‌తో పాటు మరో వ్యాపారి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు ఐటీ శాఖ దాడులు చేయాలని భావించింది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం లీక్‌ కాకుండా ఉండటం కోసం కోవిడ్‌ వారియర్స్‌ పేరుతో రంగంలోకి దిగారు. తమ వాహనాల మీద కూడా ‘మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కోవిడ్‌-19 బృందాన్ని ఆహ్వానిస్తుంది’ అనే స్టిక్కర్లను అంటించుకున్నారు. (తమిళనాడులో పట్టుబడిన డబ్బు మాదే..! )

ఇక వీరంతా తోమర్‌తో పాటు మరో వ్యాపారికి చెందిన 20 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. ఇవి ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 100 స్థిరాస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఈ వ్యాపారవేత్తలకు భోపాల్‌, సెహోర్‌ జిల్లాలో రెండు క్రికెట్‌ మైదానాలు ఉన్నాయని సమాచారం. వీటి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ దాడులపై కాంగ్రెస్‌ స్పందిస్తూ.. ‘ఇది కేబినెట్‌ మంత్రి అర్హతను తగ్గిస్తుంది. ఇటీవల అదే మంత్రి రాఘవేంద్ర తోమర్‌ని తన సోదరుడిగా బహిరంగంగా ప్రకటించారు. ఇక ఈ దాడుల నేపథ్యంలో తోమర్‌తో అతడి సంబంధాలను ప్రజలకు తెలియచేయాలి’ అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ట్వీట్‌ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ కాంగ్రెస్‌ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆదాయపు పన్ను శాఖ చట్ట ప్రకారం తన పని తాను చేసుకుపోతుంది. బీజేపీ నాయకులను కించపర్చడానికే కాంగ్రెస్‌ తప్పుడు ఆరోపణలు చేస్తోంది అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top