సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా? | Tamil Nadu CM Stalin Questions PM Modi | Sakshi
Sakshi News home page

సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?

Mar 25 2026 7:59 AM | Updated on Mar 25 2026 7:59 AM

Tamil Nadu CM Stalin Questions PM Modi

సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్‌–ఇజ్రాయిల్‌ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు  సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. 

సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? 
తన ఎక్స్‌పేజీ  వేదికగా కేంద్ర ప్రభుత్వానికి  పలు ప్రశ్నలు సంధించారు:  “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని,  మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు.

 కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్‌ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్‌ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్‌ స్టవ్‌లను వాడితే, అదనపు విద్యుత్‌ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్‌ హీటర్లు, స్టవ్‌లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. 

ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు.  కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు.  గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్‌ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement