Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి

Suspicious fever 32 children and seven adults effected: UP CM Adityanath - Sakshi

ఫిరోజాబాద్‌లో విస్తరిస్తున్న అంతుచిక్కని జ్వరం

ఇప్పటికే 39 మంది మృత్యువాత, వీరిలో32 మంది చిన్నారులు

 దాదాపు 200 మంది చిన్నారులకు చికిత్స

లక్నో: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశపై నిపుణుల హెచ్చరికల ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్‌లో అంతుచిక్కని జ‍్వరం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.  ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఏడుగురు వృద్ధులతోపాటు 32 మంది చిన్నారులు ఉండటం మరింత ఆందోళన రేపుతోంది.  

ఫిరోజాబాద్‌లో 32 మంది పిల్లలు, ఏడుగురు పెద్దలు మరణించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ధృవీకరించారు. జిల్లాలో డెంగ్యూలాంటి జ్వరం కారణంగా ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. బాధిత  కుటుంబాలను సందర్శించిన సీఎం యోగి వారికి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిరోజాబాద్‌లోని 100 పడకల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆగస్టు 18న మొదటి కేసు నమోదైందని  ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 200మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వైద్యులు ప్రకటించారు. అనుమానాస్పద వ్యాధితో 102 డిగ్రీల సెల్సియస్‌ జ‍్వరంతో బాధితులు బాధపడుతున్నారని, ఈ జ్వరం తగ్గడానికి నాలుగు రోజులు పడుతోందన్నారు  వెల్లడించారు. గతవారం నుంచి ఇక్కడ విషజ్వరం పీడితుల సంఖ్య మరింత విజృంభిస్తోంది. గత వారం 40 మంది పిల్లలు ఈ వ్యాధితో మరణించారని  ఫిరోజాబాద్‌ ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆదివారం ప్రకటించారు.

అయితే ఈ వాదనను యుపీ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తిరస్కరించారు. థర్డ్‌ వేవ్‌ వచ్చేసిందన్న వాదన సరికాదని, భారీ వర్షాలు, నీటి నిల్వ కారణంగా, పిల్లలలో మలేరియా, డెంగ్యూ, అధిక జర్వం లాంటి లక్షణాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే తమ ఆరోగ్య బృందం నిర్వహించిన పరీక్షల్లో బాధితులందరికీ కరోనా నెగిటివ్‌ వచ్చిందని చెప్పారు. మిగిలిన వారి శాంపిల్స్‌ను  కూడా లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామన్నారు.

మరోవైపు యూపీలోని ఫిరోజాబాద్, మధుర, ఆగ్రా తదితర ప్రదేశాలలో చోటచేసుకుంటున్న మరణాలపై కాంగ్రెస్‌ ప్రధాన  కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక‍్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top