
విమానయాన రంగంలో కఠిన తనిఖీలు
ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా
తీవ్ర లోపాలుంటే విమానం నిలిపివేత
ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న డీజీసీఏ
మనం వాడే బండిని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాం. బ్రేకులు సరిగా పడుతున్నాయా, టైర్లలో గాలి ఉందా, సరిపడా ఇంధనం ఉందా అని రోజూ చెక్ చేస్తాం. అలాంటిది గాల్లో ఎగిరే విమానం అయితే? మనం మన వాహనాన్ని చెక్ చేసినట్టే విమానాన్ని ఒక్క పైలట్ చెక్ చేస్తే సరిపోతుందా? అస్సలు కాదు.. కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు విమానయాన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీల నిఘా కళ్లు ప్రతి క్షణం పర్యవేక్షిస్తుంటాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఈ సంస్థలు ఒక ప్రణాళిక ప్రకారం విమానాలు, విమానాశ్రయాలు, సర్వీసింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడమేకాదు.. ఆకస్మిక తనిఖీలూ చేసి ఉల్లంఘనలపై
ఉక్కుపాదం మోపుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఈ ఏడాది జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తాలూకా చేదు జ్ఞాపకాలు భారతీయుల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 275 మందికిపైగా ప్రాణాలను బలి తీసుకున్న ఘోర దుర్ఘటన నేపథ్యంలో దేశంలో అమలవుతున్న విమానయాన నిబంధనలు, భద్రత అంశం చర్చకు వచ్చింది. విమానయానంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ కీలక సంస్థల పనితీరుపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా, సాంకేతిక సమస్యనా అన్నది పక్కన పెడితే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వంటి ప్రభుత్వ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇందుకు ఈ సంస్థలు చేపట్టిన తనిఖీలే నిదర్శనం. 2023 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు 9,423 తనిఖీలు చేపట్టాలన్నది ప్రణాళిక కాగా రికార్డు స్థాయిలో 13,753 తనిఖీలు చేపట్టడం గమనార్హం.
రెక్కలు కట్టేస్తారు..: డీజీసీఏ బృందం అన్ని విమాన సంస్థలకు చెందిన విమానాల తనిఖీ చేపడుతుంది. విమానం సురక్షితంగా ప్రయాణం సాగించే స్థాయిలో ఫిట్‌గా ఉందా లేదా అని పరీక్షిస్తారు. లోపాలు, ఉల్లంఘనలు బయటపడితే డీజీసీఏ హెచ్చరికలు జారీ చేస్తుంది. తీవ్ర లోపాలు, ఉల్లంఘనలైతే విమానాలకు భద్రతా ధ్రువీకరణను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అంటే విమానం ఎగరకుండా నిరోధిస్తారు. ఫిట్‌గా ఉందని తేలాకే సస్పెన్షన్ ఎత్తేస్తారు. అంతేకాదు, నిబంధనలను పాటించకపోతే భారీ పెనాల్టీలు విధిస్తారు. 2023 నుంచి 2025 జూలై 20 వరకు 597 విమానాలు సస్పెన్షన్ కు గురయ్యాయంటే ఏ స్థాయిలో తనిఖీలు నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు.
ఆకస్మిక తనిఖీలు..: విమానం, సిబ్బంది, ఆపరేటర్లు భూమిపై ఉన్నప్పుడు విమానయాన నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి డీజీసీఏ అధికారులు అప్రకటిత (ర్యాంప్ ఇన్ స్పెక్షన్ ్స) తనిఖీలు నిర్వహిస్తారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఎంట్రీ ఇస్తారు. ఇలా భారత్‌లోని విమానాశ్రయాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న దేశ, విదేశీ విమానాలకు సంబంధించి 2023 జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 1,188 ర్యాంప్ ఇన్ స్పెక్షన్ ్స జరిగాయి. ఈ తనిఖీల్లో 338 లెవెల్–2 స్థాయి లోపాలను గుర్తించారు.
ప్రతి ప్రయాణానికి ముందు విమానానికి తనిఖీలు తప్పనిసరి. విమానం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి పైలట్స్, నిర్వహణ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారు. అంతా బాగుంది అని నిర్ధారించుకున్నాకే విమానం గాల్లోకి లేస్తుంది. లేదంటే సర్వీస్ రద్దు అవుతుంది.
విమానం వెలుపల: విమానం నిర్మాణం, బాహ్య, నియంత్రణ ఉపరితలాలపై ఏదైనా నష్టం, లీకేజీ, అరిగిపోయాయా అని చూస్తారు.
అంతర్గత తనిఖీలు: కాక్‌పిట్‌లోని పరికరాలు, రేడియోలు, విద్యుత్ పరికరాలు, ఇతర ముఖ్యమైన భాగాల పనితీరును ధ్రువీకరిస్తారు.
పత్రాల ధ్రువీకరణ: లైసెన్సులు, రిజిస్ట్రేషన్, బీమా వంటి అన్ని అవసర పత్రాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు.
ఇంధనం స్థాయిలు: తగినంత ఇంధనం, చమురు, తగు పాళ్లలో, నాణ్యంగా ఉన్నాయని నిర్ధారించుకుంటారు.నియంత్రణ వ్యవస్థలు: విమాన నియంత్రణలు, బ్రేక్స్, ఇతర క్లిష్ట వ్యవస్థలు పనిచేస్తున్న తీరు, కార్యకలాపాలను పరీక్షిస్తారు.
వాతావరణ పరిశీలన: విమానం ఎగరడానికి, దిగడానికి అనుకూల వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తారు. వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్నాకే విమానం వెళ్తుంది.