కరోనా రోగులకు మరో షాక్‌?!

Shortage Of Oxygen‌ Cylinders Across The Country Due To Corona Pandemic - Sakshi

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత

ఆక్సిజన్‌ కేసులు 43 వేల నుంచి 75 వేలకు  

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజృంభణతో ఓ పక్క దేశంలోని కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు సహా ప్రభుత్వాస్పత్రులన్నీ కిక్కిరిసి పోతుండగా, ఉన్నంతలో వారికి తగిన చికిత్సను అందించేందుకు కుస్తీ పడుతోన్న వైద్య సిబ్బందికి ఇప్పుడు పెనం మీద పిడుగు పడిన  చందంగా ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఎదురయింది. కరోనా వైరస్‌తో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరవుతోన్న రోగులకు వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందించడం అవసరమన్న విషయం అర్థమైందే. దేశంలో కరోనా రోగుల సంఖ్య ఇప్పటికే 80 లక్షలు దాటిపోగా వారిలో కొన్ని లక్షల మందికి ఆక్సిజన్‌ వెంటిటేటర్లు అవసరం అవుతున్నాయి. (చదవండి : ఫ్యూచర్‌ మహమ్మారులు మరింత డేంజర్‌..!)

దేశంలో వైద్య అవసరాలతోపాటు గ్లాస్, స్టీల్‌ పరిశ్రమలకు కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరం. గ్లాస్, స్టీల్‌ పరిశ్రమలకు తాత్కాలికంగా గ్యాస్‌ సరఫరాను నిలిపివేసి వైద్య అవసరాలకే ఆక్సిజన్‌ సిలిండర్లను మళ్లించినప్పటికీ సెప్టెంబర్‌ నెలలో దేశంలోని ఆస్పత్రులకు రోజుకు మూడు వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని ‘ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ మానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌’కు చెందిన రాజీవ్‌ గుప్తా తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కరోనా వైరస్‌ దాడికి ముందు దేశంలో రోజుకు 6, 400 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి జరిగేది. వాటిలో వైద్య అవసరాలకు వెయ్యి మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌కు మించి అవసరం పడలేదు. (చదవండి : అమ్మ ఉద్యోగం పోయింది.. టీ అమ్ముతున్నా)

మొత్తం ఆక్సిజన్‌ ఉత్పత్తిలో 70 నుంచి 80 శాతం గ్లాస్, స్టీల్‌ పరిశ్రమలు వినియోగించుకునేవని పంజాబ్‌లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కంపెనీ ‘హైటెక్‌ ఇండస్ట్రీస్‌’ అధిపతి ఆర్‌ఎస్‌ సచ్‌దేవ్‌ తెలిపారు. వైద్య అవసరాలకు ఆక్సిజన్‌ సిలిండర్లను మళ్లించినట్లయితే పరిశ్రమలు నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటి, రెండు సిలిండర్ల కొరత ఏర్పడితే సర్దు కోవచ్చుగానీ, లోడుల లెక్కన కొరత ఏర్పడితే నష్టాన్ని భరించడం కష్టమని ఆయన చెప్పారు. అయినప్పటికీ తమ ప్రాథమిక ప్రాథామ్యం వైద్య అవసరాలు తీర్చడమని రాజీవ్‌ గుప్తా తెలిపారు. కోవిడ్‌ దండయాత్ర కారణంగా వైద్య అవసరాల కోసం ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచామని ఆయన చెబుతున్నప్పటికీ అది ఎంత అన్నది ఆయన చెప్పలేక పోయారు. 

దేశవ్యాప్తంగా వైద్య అవసరాలకు ఆక్సిజన్‌ కొరత ఉందని కేరళలోని మనోరమ గ్యాసెస్‌ అధినేత ఆంథోని జోసఫ్‌ తెలిపారు. దేశంలోని అవసరాలకు తమ ఉత్పత్తులు చాలడం లేదని ఆయన చెప్పారు. పీకల మీదకు వచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ విపక్షాలు చేస్తోన్న విమర్శల్లో నిజం లేకపోలేదన్నట్లుగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆస్పత్రుల కోసం ఓ లక్ష మెట్రిక్‌ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అక్టోబర్‌ 14వ తేదీన ప్రభుత్వ రంగంలోని  ‘హెచ్‌ఎల్‌ఎల్‌ (హిందుస్థాన్‌ లాటెక్స్‌ లిమిటెడ్‌) లైవ్‌ కేర్‌’ ద్వారా బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. అవి ఎప్పుడు ఖరారు అవుతాయో, అదనపు ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికి ఎరుకో! దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 15 శాతం మందికి ఆస్పత్రి వైద్య సేవలు అవసరం అవుతున్నాయని, వాటిలో ఐదు శాతం కేసులకు ఆక్సిజన్‌ వెంటిలేటర్ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అవసరం అవుతున్నాయని ‘ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఓ విలేకరుల సమావేశంలో చెప్పారు.(చదవండి : ఎఫ్‌డీసీ నుంచి 800ఎంజీ ఫావిపిరావిర్)‌

కరోనా కారణంగా వైద్య అవసరాలకు ఆక్సిజన్‌ వినియోగం అంతకుముందుకన్నా ఏడెనిమిదింతలు పెరగడం ఆక్సిజన్‌ కొరతకు ఓ కారణం కాగా, లాక్‌డౌన్‌ నాటి నుంచి ఆక్సిజన్‌ పరిశ్రమలు ఊపిరి పీల్చుకోకుండా పని చేస్తుండడంతో దేశంలోని కొన్ని పరిశ్రమలు ‘బ్రేక్‌డౌన్‌’ అవడం మరో కారణం. వార్శిక మెయింటెనెన్స్‌లో భాగంగా ఏటా కొన్ని రోజుల పాటు ఈ పరిశ్రమలను మూసి వేయాల్సి ఉంటుందన్న తెల్సిందే. దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత ఏప్రిల్‌ నెల నాటికి 57,924 బెడ్లకు ఆక్సిజన్‌ సపోర్ట్‌ ఉండగా, వాటి సంఖ్య అక్టోబర్‌ నాటికి 2,65,046 చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నాటికి దేశంలో 43,033 మంది ఆక్సిజన్‌ థెరపీ తీసుకుంటుండగా, అక్టోబర్‌ ఒకటవ తేదీ నాటికి వారి సంఖ్య 75,098కి చేరుకుంది. ఆక్సిజన్‌ అవసరాలు ఇలాగే పెరిగితే కిమ్‌కర్తవ్యం?!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top