కాంగ్రెస్‌ది నమ్మక ద్రోహం  | Saffron Surge Congress Betrayal PM Modi Roars in Bengaluru | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ది నమ్మక ద్రోహం 

May 10 2026 11:52 AM | Updated on May 11 2026 5:15 AM

Saffron Surge Congress Betrayal PM Modi Roars in Bengaluru

బెంగళూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం  

సాక్షి బెంగళూరు: కాంగ్రెస్‌ ఒక విశ్వాస ఘాతుక పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని నిప్పులు చెరిగారు. 2014 కంటే ముందు కేంద్రంలో పదేళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ కేవలం మిత్రపక్షాలను మాత్రమే వెన్నుపోటు పొడవలేదని, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత తొలిసారిగా ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చిన మోదీని బీజేపీ నాయకులు అభినందించారు. 

ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఖజానాను లూటీ చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో సఫాయి కారి్మకులకు వేతనాలు ఇవ్వడం లేదని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేరళ ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయడం సాధ్యపడడం లేదని వ్యాఖ్యానించారు.  
  
కేరళలో అధికారం తథ్యం  
బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే రెండు, మూడుసార్లు ప్రజలు అధికారం అప్పగించేలా తమ పార్టీ పాలన ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పదేళ్ల క్రితం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 203 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని వెల్లడించారు. కేరళలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అక్కడ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తంచేశారు.  

సమాజం క్రియాశీలం అయినప్పుడే.. 
దేశ నిర్మాణంలో సమాజం క్రియాశీలకంగా పాలుపంచుకుంటే అప్పుడే ప్రభుత్వం విజయం సాధించినట్లు అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. దేశ ప్రజలు, సమాజం క్రియాశీలం అయినప్పుడే అతిపెద్ద సవాళ్లకు సామూహికంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బెంగళూరులో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ 45వ వార్షికోత్సవంతోపాటు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ 70వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవ్య ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. బెంగళూరు కేవలం సాంకేతిక నగరం కాదని, ఇదొక అధ్యాత్మిక నగరమని పేర్కొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం దేశ సంస్కృతిలో అంతర్భాగాలని చెప్పారు. వీటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement